ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు వేసుకునే జెర్సీ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 1992 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు వేసుకున్న జెర్సీలా కొత్తది ఉండడమే అందుకు కారణం. మరి టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లో వేసుకున్న ఆ జెర్సీని ఎందుకు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందంటే..!
భారత జట్టు దుస్తుల స్పాన్సర్‌గా సుదీర్ఘ కాలం పాటు ఉన్న నైకీ ఒప్పందం సెప్టెంబర్‌లో ముగిసింది. ఒప్పందం పొడిగించుకోవడానికి ఆ సంస్థ ఆసక్తి చూపించకపోవడం వల్ల ఆ స్థానంలో ఎంపీఎల్ కొత్త స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో జెర్సీలో నైకీ వాడిన రూపకల్పనను ఎంపీఎల్ ఉపయోగించకూడదు. కాపీరైటు హక్కుల ఉల్లంఘన రాకుండా ఉండేందుకు బీసీసీఐ, ఎంపీఎల్ కలిసి టీమ్‌ఇండియా ఆటగాళ్లకు కొన్ని జెర్సీ రూపకల్పనలను పంపించాయి. వాళ్లు 1992 జెర్సీకి అంగీకారం తెలిపారు.
"ఎంపీఎల్ కొత్త స్పాన్సర్ కాబట్టి.. గత స్పాన్సర్ రూపొందించిన జెర్సీ రూపకల్పనను వాడడానికి వీల్లేదు. దీంతో 1992 జెర్సీతో సహా కొన్ని కొత్త నమూనాలను ఎంపీఎల్ మాకు పంపించింది. వాటిపై ఆటగాళ్ల అభిప్రాయాలను కోరాం. వాళ్లు 1992 ప్రపంచకప్‌లో భారత జట్టు వేసుకున్న జెర్సీకి సరేనన్నారు. అయితే ఈ కొత్త జెర్సీ ఎక్కువ కాలం ఉండదు. ఎంపీఎల్ తన సొంత సాంకేతికతతో నూతన జెర్సీని రూపొందించాల్సి ఉంది" అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు.