ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడిన తీరు మరువలేనిది. ఈ మ్యాచ్లో భారత జట్టు గట్టెక్కడం అసాధ్యమనే అనుకున్నారు. కానీ శరీరాలకు తగిలిన గాయాలతో విహారి-అశ్విన్ బ్లాక్‌థాన్ వ్యూహం, పంత్ సాహసోపేత ఇన్నింగ్స్, పుజారా బలమైన డిఫెన్స్... ఇలా టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేయడం వల్ల డ్రాగా ముగిసింది.
గాయాలు వేధిస్తున్నా సరే పెయిన్ కిల్లర్స్ తీసుకుని పంత్, హనుమ విహారి, అశ్విన్ వెన్ను చూపకుండా పోరాడిన తీరుపై ప్రశంసించకుండా ఉండలేం. అయితే వీరిలో పంత్, విహారి మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకుని మైదానంలో బరిలో దిగారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఇదే నిజమైతే వారిని సూపర్ హీరోస్ అనాల్సిందే.
ఆడతాడో లేదో అనుకున్నాం
తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్ బౌలింగ్‌లో పంత్ గాయపడ్డాడు. మోచేతికి తీవ్ర గాయమైంది. అదృష్టవశాత్తు ఎముక విరగకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడా లేదా అన్న సందేహం అందరికీ ఉంది. అయితే ఆశ్చర్యకరంగా విహారి కన్నా ముందే క్రీజులోకి వచ్చి, ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 118 బంతులాడి 97 పరుగులు చేశాడు. ఓవైపు గాయం వేధిస్తున్నా మధ్య మధ్యలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూనే బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు.
పంత్ చూపిన బాటలో..
పంత్ ఔటైన తర్వాత విహారి క్రీజులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో పెద్దగా ఫామ్‌లో లేని విహారికి వచ్చీ రాగానే గాయమైంది. గజ్జల్లో గాయం కారణంగా అతడు పరుగెత్తలేకపోయాడు. ఎలాగోలా వికెట్లకు అడ్డుగోడలా నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే చాలన్న పట్టుదలతో ఆడాడు. మధ్యలో సమయం దొరికినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూనే ఉన్నాడు.
ఇదీ చూడండి: డ్రాగా ముగిసిన భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు