వచ్చే ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా పూర్తి స్థాయి ఐపీఎల్‌ను నిర్వహించి నైపుణ్యమున్న క్రికెటర్లను వెలికి తీయాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ వచ్చే ఏడాది అమ్మాయిలకు పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి. ఎనిమిది జట్లు లేకపోయినా.. కొన్ని జట్లతో అయినా మహిళల ఐపీఎల్ నిర్వహించడం వల్ల క్రికెటర్లకు మేలు జరుగుతుంది. ప్రతిభ బయటికొస్తుంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళల బిగ్‌బాష్ లీగ్‌ను అందుకే ప్రోత్సహిస్తోంది."
- సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ క్రికెటర్
మహిళల టీ20 ఛాలెంజర్ పేరిట 2018 నుంచి ఐపీఎల్ జరిగే సమయంలోనే బీసీసీఐ స్వల్పకాలిక టోర్నీ నిర్వహిస్తోంది.