అది 1971 మార్చి 6.. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ అయిదున్నర అడుగుల బ్యాట్స్‌మన్‌కు అదే తొలి టెస్టు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్‌గా అర్ధశతకాలు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అరంగేట్ర సిరీస్‌లోనే భీకర విండీస్ బౌలర్లను ఎదుర్కొని 774 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఇక అక్కడి నుంచి తనకు రికార్డులు మిత్రులుగా మారిపోయాయి. అతనే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. తన క్రికెట్ అరంగేట్రానికి నేటితో 50 ఏళ్లు పూర్తి. స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 71 ఏళ్ల సన్నీ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..!
ఆరంభ సిరీస్‌లోనే అదరగొట్టాను..
భారత క్రికెట్‌తో నా ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోందంటే సంతోషంగా ఉంది. ఈ అయిదు దశాబ్దాల కాలంలో ఆటకు సంబంధం ఉన్న ఎన్నో పాత్రలు పోషించా. అరంగేట్ర టెస్టు మ్యాచ్ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి. కొంతకాలం నిరీక్షణ తర్వాత తొలిసారి జాతీయ జట్టు టోపీ ధరించి, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. దిగ్గజం గ్యారీ సోబర్స్ సారథ్యంలోని వెస్టిండీస్‌తో మ్యాచ్ కాబట్టి ఒత్తిడికి లోనయ్యా. ఆ సిరీస్‌లో 774 పరుగులు చేశాననే విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో విఫలం కాకూడదని అనుకున్నా. ఆ సిరీస్‌లో కనీసం 350 నుంచి 400 పరుగులు చేసినా సంతృప్తి చెందేవాణ్ని. ఎందుకంటే నేను చేసిన 774 పరుగుల్లో 374 పరుగులు నా ఆరాధ్య ఆటగాడైన ఎంఎల్ జైసింహా, సలీమ్ దురానీకి ఇస్తే బాగుండనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు వాళ్లు జట్టులో ఉండేవాళ్లు.
గెలిపించినా తొలగించారు..
1974 దాకా ఆటగాడిగా నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ ఆ తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైరవడం, కొంతమంది జట్టుకు దూరం కావడం వల్ల బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. జట్టు భారీ స్కోరు చేసిందంటే అందులో నావి, గుండప్ప విశ్వనాథ్‌వే ఎక్కువ పరుగులు ఉండేవి. నా క్రికెట్ కెరీర్‌లో జెఫ్ థామ్సన్, మైకెల్ హోల్డింగ్, మాల్కోమ్ మార్షల్ లాంటి దిగ్గజ పేసర్లను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ హెల్మెట్ వాడలేదు. బౌన్సర్లను పరుగులు చేసేందుకు అవకాశంగా చూసేవాణ్ని. మేం ఆడే రోజుల్లో ఓ సిరీస్‌లో ఓటమి ఎదురు కాగానే కెప్టెన్‌ను తొలగించేవాళ్లు. వెస్టిండీస్‌తో 1978-79 సిరీస్‌లో 732 పరుగులు చేయడమే కాకుండా జట్టుకు విజయాన్ని అందించినా.. నన్ను కెప్టెన్‌గా తొలగించారు.
గౌరవంగా భావిస్తా..
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాసాలు, పుస్తకాలు రాసా. ఆ తర్వాత వ్యాఖ్యాతగా మారా. మా మాటలతో ఆటకు అదనపు హంగులు చేర్చకపోతే మాట్లాడనవసరం లేదని నేను వ్యాఖ్యానం మొదలెట్టినపుడు చెప్పారు. ప్రస్తుతం సాంకేతికత ఎప్పటికప్పుడూ మారుతోంది. 78 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ భారత ఐకాన్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్, తన పాటలతో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే దివంగత గాయకుడు కిశోర్ కుమార్ లాంటి దిగ్గజాల్లాగా నేనూ చిరకాలం గుర్తుండిపోతానంటే గౌరవంగా భావిస్తా.
ఇదీ చదవండి: టీమ్ఇండియా యువ కెరటం- ప్రత్యర్థుల పాలిట సునామీ