భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై మరో దిగ్గజం సునీల్ గావస్కర్ భావోద్వేగంతో స్పందించాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా ధోనీని కలుసుకోవడాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ముందు తాను వ్యక్తం చేసిన కోరిక గురించి చెప్పాడు. భారత్‌కు 2011 ప్రపంచకప్‌ను అందించిన ధోని సిక్స్‌ను చూసి ఈ ప్రపంచానికి వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు అతడికి చెప్పానని గావస్కర్ తెలిపాడు.
"ప్రపంచకప్ తర్వాత కొన్ని రోజులకు ఐపీఎల్ మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్ తొలి మ్యాచ్ ఆడుతోంది. నేను మైదానంలో ఉన్నా. ధోనీని కలిసి.. 'చూడు ధోని.. ఈ ప్రపంచంలో ఇక నాకు కొన్ని నిమిషాలే మిగిలి ఉన్నాయనుకుంటే.. ఎవరినైనా ఆ షాట్ చూపించమని అడుగుతా. ఎందుకంటే ఆ సిక్స్‌ను చూసి ప్రపంచానికి వీడ్కోలు చెప్పాలని కోరుకుంటున్నా. అది అత్యుత్తమ మార్గం. ముఖంపై చిరునవ్వుతో కన్నుమూస్తా' అని చెప్పా. ధోని నవ్వాడు.. ఏమీ అనలేదు" అని గావస్కర్ చెప్పాడు.