యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబరు 19న మొదలవుతుందని బీసీసీఐ ప్రకటించి నెల దాటింది. ఆపై టోర్నీ ముగింపు తేదీని నవంబరు 10గా ఖరారు చేశారు. ఇక అంతే.. పూర్తి షెడ్యూల్ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప అది ఖరారవ్వలేదు. దాని గురించి ఏ ప్రకటనా లేదు. ఐపీఎల్ జట్లు యూఏఈకి బయల్దేరే సమయానికే పూర్తి షెడ్యూల్ వచ్చేస్తుందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి కానీ.. ఇంకో వారం దాటాక కూడా దాని ఊసే లేదు.
టోర్నీ ఆరంభానికి ఇంకో మూడు వారాలు మాత్రమే సమయం ఉంది. ఇంకా షెడ్యూల్ ప్రకటించకపోవడం వల్ల ఆటగాళ్లలో సహా అందరిలోనూ అయోమయం నెలకొంది. ఇది అంత తేలికైన విషయం కాదన్నది బీసీసీఐ వర్గాల మాట. లీగ్ ఏర్పాట్ల కోసం యూఏఈకి వెళ్లిన ఐపీఎల్ బృందం.. మ్యాచ్‌లు నిర్వహించాల్సిన మూడు నగరాల్లో పరిస్థితుల్ని సమీక్షించి ఒక అంచనాకు వచ్చాకే షెడ్యూల్ ఖరారు చేయడానికి వీలుంది.
చాలా దేశాలతో పోలిస్తే యూఏఈలో కరోనా ప్రభావం తక్కువే. వైరస్ వ్యాప్తి జరగకుండా ఆ దేశంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబి నగరాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. అబుదాబిలో కరోనా కేసులు కాస్త ఎక్కువున్నాయి. దీంతో అక్కడి విమానాశ్రయాల్లో ఆంక్షలు పెట్టారు. ఇక్కడికి రావడానికి 48 గంటల ముందే కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ వస్తేనే అనుమతిస్తారు. ఈ ప్రక్రియకు పూర్తి చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.
ముంబయి, కోల్‌కతా జట్లు అబుదాబి కేంద్రంగానే మ్యాచ్‌లు ఆడబోతుండగా.. ఇక్కడికి ఇతర జట్లు రావాలి.. అలాగే ఇవి దుబాయ్, షార్జాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రాకపోకల సమయంలో ప్రతిసారీ పరీక్షలు, అనుమతులు తప్పనిసరి. ఇందుకు ఎంత సమయం పడుతుంది.. ఈ ప్రక్రియను సరళతరం చేయడానికి ఏం చేయాలన్నదానిపై ఎమిరేట్స్ క్రికెట్ సంఘం అధికారులతో ఐపీఎల్ బృందం చర్చిస్తోంది. మ్యాచ్‌ల తేదీలు ఖరారు చేసే ముందు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే.ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.