2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తమ దేశం భారత్‌కు అమ్ముడుపోయిందని అప్పటి శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహీందనంద ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే, దాన్ని క్రిమినల్ కేసుగా పరిగణిస్తున్నట్లు అక్కడి క్రీడా మంత్రిత్వ శాఖ సెక్రటరీ రువాన్‌చంద్ర సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆ కేసులో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభమైందని, అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు.
మహీందనంద ఆరోపణలకు ముందే 2017లో.. శ్రీలంక ప్రపంచకప్ విజేత(1996) జట్టు సారథి అర్జున రణతుంగ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై తనకు అనుమానాలున్నాయని, ఆ మ్యాచ్‌పై ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే మహీందనంద ఇటీవల చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. పోలీసులు విచారణ సందర్భంగా.. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందనేది తన అనుమానమేనని మాట మార్చారు. ఈ నేపథ్యంలోనే ఆ మొత్తం వ్యవహారంపై క్రీడాశాఖ క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
మహీందనంద వ్యాఖ్యలపై ఆ రోజే కుమార సంగక్కర, మహేలా జయవర్ధనే స్పందించారు. 2011 ప్రపంచకప్‌లో ఆ జట్టు సారథిగా కొనసాగిన సంగక్కర.. మహీందనంద ఆరోపణలకు సాక్ష్యాలుంటే ఐసీసీకి అందజేసి విచారణ జరిపించాలని కోరారు. నాటి ఫైనల్లో శతకంతో మెరిసిన జయవర్ధనే మహీందనంద వ్యాఖ్యలను ఖండించారు.