టీమిండియా.. గత కొంత కాలం నుంచి ఫీల్డింగ్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు చేస్తోందన్నాడు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అలాంటి తప్పుల వల్లే మ్యాచ్ చేజారిందని చెప్పాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లోపు మునుపటి ప్రమాణాల్ని అందుకుంటామని అన్నాడు.
"భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రస్తుతం సాధారణంగా ఉంది. అయితే త్వరలోనే ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటా. కివీస్‌తో తొలి వన్డేలో టేలర్ ఇచ్చిన క్యాచ్ కుల్దీప్ అందుకుని ఉండాల్సింది. అంతకు ముందు ఓవర్లోనే అతడు బౌలింగ్ చేయడం వల్ల, ఆ ఓవర్లో ఇచ్చిన పరుగులు గురించి అప్పుడు ఆలోచిస్తూ ఉండొచ్చు. అందుకే అలా జరిగిందేమో?" -ఆర్. శ్రీధర్, టీమిండియా బౌలింగ్ కోచ్
తొలి మ్యాచ్‌లో టేలర్... 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కుల్దీప్ వదిలేశాడు. ఫలితంగా చివరి వరకు అజేయంగా నిలిచిన రాస్.. సెంచరీ చేసి, తమ జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చేసిన కొన్ని తప్పిదాలు, ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చాయి. ఈ రెండు జట్ల మధ్య రేపు(శనివారం) ఉదయం 7.30 గంటల నుంచి రెండో వన్డే ప్రారంభం కానుంది.