సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు టీమ్ఇండియా సీనియర్ పేసర్ శ్రీశాంత్. అయితే.. తన లక్ష్యం దేశవాళీ టోర్నీ మాత్రమే కాదని 2023 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియా తరఫున ఆడి, టైటిల్ నెగ్గడమే తన అసలైన లక్ష్యమని చెప్పాడు. 37 ఏళ్ల వయసు ఉన్న తనకు లియాండర్ పేస్, రోజర్ ఫెదరర్ స్ఫూర్తి అని తెలిపాడు.
"ఈ వయసులో క్రీడల్లో సాధించేది ఏదీ ఉండదు అనేది నిజమే. కానీ, లియాండర్ పేస్ 42 ఏళ్లపుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. రోజర్ ఫెదరర్ ఎంతలా దూసుకువెళ్తున్నది అందరికీ తెలిసిందే. ఒక ఫాస్ట్ బౌలర్‌గా ఇప్పుడు నేను చరిత్ర సృష్టించబోతున్నా. కేవలం దేశవాళీ టోర్నీల్లో ఆడడమే లక్ష్యంగా భావించడం లేదు. రాబోయే మూడేళ్ల కోసం నేను ఎదురు చూస్తున్నా. 2023 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడి, టైటిల్ నెగ్గాలన్నది నా లక్ష్యం."
-శ్రీశాంత్, భారత సీనియర్ పేసర్
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడని శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ సెప్టెంబర్‌లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో దాదాపుగా ఏడేళ్ల తర్వాత అతడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో.. కేరళ తరఫున పోటీ క్రికెట్ ఆడుతుండటం గమనార్హం.
ఇదీ చూడండి:దేశవాళీ టోర్నీలో సచిన్ తనయుడికి నో ఛాన్స్