దక్షిణాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు పూర్తయిన తర్వాత క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం రిటైర్మెంట్ తీసుకుంటానని ఇంతకు ముందే ప్రకటించాడు.
ఫిలాండర్.. దక్షిణాఫ్రికా తరఫున 64 టెస్టులు, 30 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, పొట్టిఫార్మాట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌తో పాటు దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బౌలర్‌గా సేవలందించిన ఫిలాండర్.. తన తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటాడు.
అయితే ఆఖరి టెస్టు ఫిలాండర్‌కు చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయింది. జట్టును గెలిపించి, వీడ్కోలు పలకాలనుకున్న అతడికి నిరాశే ఎదురైంది. ఐసీసీ.. తన మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడం సహా ఓ అయోగ్యత పాయింట్ చేర్చింది. నాలుగో టెస్టు రెండో రోజు బట్లర్‌ను ఔట్ చేసిన తర్వాత, అతడు హద్దు మీరి ప్రవర్తించినందుకు ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 191 పరుగుల తేడాతో ఓడింది దక్షిణాఫ్రికా. సిరీస్‌ను 3-1తో కోల్పోయింది. అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఫిలాండర్ ఎన్నో సేవలు అందించాడని, అతడిని జట్టు మిస్ అవుతుందని అన్నాడు.