దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా కుదేలయింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. జుబైర్ హంజా(62) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్ల జోరుకు ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. షమి, నదీమ్, జడేజా తలో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. 335 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్. అనంతరం ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడిస్తోంది కోహ్లీసేన.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 497/9 స్కోరు వద్ద డిక్లేర్ ఇవ్వగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు సఫారీలు. ఓవర్ నైట్ స్కోరు 9/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే డుప్లెసిస్(1) వికెట్ కోల్పోయింది.
అనంతరం మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు హంజా - బవుమా. వీరిద్దరూ 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధశతకం చేసి ఊపుమీదున్న హంజాను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జడేజా. కాసేపటికే బవుమాను స్టంపౌట్‌తో వెనక్కి పంపాడు నదీమ్.
భోజన విరామ సమయానికే ఆరు వికెట్లు కోల్పోయారు సఫారీలు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా త్వరత్వరగా రెండు వికెట్లు చేజార్చుకుంది. అయితే చివర్లో జార్జ్ లిండే(37)-నోర్ట్జే గంటన్నరకు పైగా క్రీజులో పాతుకుపోయారు. లిండేను ఔట్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే నోర్ట్జేను ఎల్బీడబ్ల్యూ చేశాడు నదీమ్.
497 స్కోరులో సగం పరుగులు కూడా చేయని దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌కు ఆహ్వానించింది కోహ్లీసేన. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ద్విశతకంతో అదరగొట్టగా.. సెంచరీతో రహానే ఆకట్టుకున్నాడు.
- ప్రత్యర్థి జట్లను ఎక్కువ సార్లు(8) ఫాలో ఆన్‌కు ఆహ్వానించిన భారత కెప్టెన్ల్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్(7), ధోనీ(5), గంగూలీ(4) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- సొంతగడ్డపై ఓ సిరీస్‌లో రెండు సార్లు ఫాలో ఆన్‌కు ఆహ్వానించడం 1993 తర్వాత ఇదే తొలిసారి.
- 2001-02 సీజన్ ఆస్ట్రేలియాపై తర్వాత వరుసగా రెండు సార్లు ఫాలోఆన్‌కు రావడం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సారి.