ఒకప్పుడు ఒడుదొడుకుల్లో ఉన్న టీమిండియాను తన కెప్టెన్సీతో సరైన మార్గంలో నడిపించిన సౌరభ్ గంగూలీ.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మరోసారి తన మార్కును చూపిస్తున్నాడు. డే అండ్ నైట్ టెస్టు ప్రతిపాదనతో అందరి దృష్టిని ఆకర్షించిన దాదాతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది.
డే అండ్ నైట్ టెస్టు సన్నాహాలు ఎలా ఉన్నాయి..?
పింక్ బంతితో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ టెస్టు కోసం చాలా కష్టపడ్డాం. డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి స్టేడియంలో తగినవిధంగా మార్పులు చేశాం. మ్యాచ్ ముందు రోజు ఏర్పాట్లు మరోసారి పర్యవేక్షిస్తాం.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎలా ఉంది..?
చాలా ఆనందంగా ఉంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. బంగ్లాతో డే అండ్ నైట్ టెస్టు కోసం టికెట్లన్ని ముందే అమ్ముడుపోయాయి.
టికెట్ల విక్రయంలో వివాదంపై..
కోలకతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం టికెట్లు విడుదలైన కొన్ని రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ విషయంపై బంగాల్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ అంశం బీసీసీఐ పరిధిలో ఉండదని గంగూలీ తెలిపాడు. పరిమిత సీట్లే ఉన్నాయన్నాడు.
విరాట్, మయాంక్ అదరగొడుతున్నారు..
టీమిండియాను విరాట్ కోహ్లీ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా బాగా ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇప్పుడే అతడి ప్రయాణం మొదలైంది. మయాంక్ క్వాలిటీ బ్యాట్స్‌మన్.
ఏ కాలం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పుడా.. అప్పుడా?
ఇప్పటికి, అప్పటికి పెద్దగా మార్పులేమి లేవు. అయితే టెస్టు ఛాంపియన్షిప్ జరుగుతుంది కాబట్టి.. ప్రస్తుత పరిస్థితులు కొంచెం సవాల్‌గానే ఉంటాయి.
కెప్టెన్.. బీసీసీ అధ్యక్షుడు.. తర్వాత ఏంటీ?
టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను.
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. డే అండ్ నైట్ నిర్వహిస్తోన్న ఈ మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. టీమిండియా తొలిసారి గులాబీ బంతితో ఆడబోతుంది.
ఇదీ చదవండి: నాలుగో టీ20లోనూ విజయం అమ్మాయిలదే