భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం గురించి వివరించాడు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్. మైదానంలో నువ్వానేనా అన్నట్లు తలపడే రెండు జట్ల క్రికెటర్లు మైదానం వెలుపల ఎంతో చనువుగా, స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో పాక్ జట్టు గెలిచాక యువరాజ్ సింగ్ తనతో అన్న మాటలను గుర్తుచేసుకున్నాడు.
"విజయం విషయానికి వస్తే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి. కానీ నాకు మరో మధుర స్మృతి ఉంది. మ్యాచ్ ముగిశాక భోజనశాలలో యువరాజ్ సింగ్‌తో మాట్లాడా. మీ జట్టు సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని మిస్సవ్వకు. వారితో కలిసి వేడుక చేసుకోవాలని యువీ నాతో చెప్పాడు. క్రికెట్ ఎలాంటి స్నేహాలను అందిస్తుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ."
-మాలిక్, పాక్ క్రికెటర్.
భారత్, పాక్ క్రికెట్ వైరాన్ని తాము చాలా మిస్సవుతున్నామని తెలిపాడు మాలిక్. ఇరువురి మధ్య సిరీస్‌లు రసవత్తరంగా జరుగుతాయని వెల్లడించాడు.
ఈ టోర్నీలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. 339 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్, శిఖర్ ధావన్, కోహ్లీ, యువరాజ్, ధోనీ విఫలమయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆశలు రేపినా జడ్డూతో సమన్వయ లోపంతో పెవిలియన్ చేరుకున్నాడు. ఫలితంగా భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇది చూడండి : లాక్‌డౌన్‌కు చెక్ పెట్టిన యువ గ్రాండ్‌మాస్టర్లు