కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. పలు దేశాల్లో సరైన వ్యక్తిగత రక్షణ తొడుగులు లేకపోవడం వల్ల వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తోన్న వైద్యులు కూడా దాని కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరాడు.
"భారత్ మాకు 10వేల వెంటిలేటర్లు అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అయితే మేం మ్యాచ్‌ల గురించి మాత్రమే మాట్లాడగలం. మిగతాదంతా అధికారిక సంస్థలే నిర్ణయిస్తాయి"
-అక్తర్, పాక్ మాజీ పేసర్
ఇరు దేశాల మధ్య ఉన్న తేడాలను మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నాడు అక్తర్. పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడమే ఆ అభ్యర్థనకు కారణం. ఇప్పటివరకు అక్కడ 4వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.