కరోనా విరామం తర్వాత స్టేడియంలో సాధన చేసిన టీమ్‌ఇండియా తొలి క్రికెటర్‌గా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. మహారాష్ట్ర పాల్ఘర్‌లోని బోయిసర్ స్టేడియంలో దేశవాళీ ఆటగాళ్లతో కలిసి శిక్షణ మొదలుపెట్టాడు. భారత్ తరఫున అతడు ఒక టెస్టు, 11 వన్డేలు, 15 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని స్టేడియాల్లో వ్యక్తిగత శిక్షణ, సాధనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. లాక్‌డౌన్ 4.0లో అభిమానులకు ప్రవేశం లేకుండా క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ తన వ్యక్తిగత శిక్షణ ప్రారంభించాడు.
"అవును, మేం ఈ రోజు సాధన చేశాం. చాలా బాగా సాగింది. రెండు నెలల తర్వాత సాధన చేసినందుకు సంతోషంగా ఉంది" అని శార్దూల్ మీడియాకు చెప్పాడు. "అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. ప్రతి బౌలర్ డిసిన్‌ఫెక్ట్ చేసిన బంతులు తెచ్చుకున్నారు. సాధనకు వచ్చిన ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతలు తనిఖీ చేశాం" అని స్టేడియం అధికారి తెలిపారు. ఈ మధ్యే రంజీల్లో అరంగేట్రం చేసిన ముంబయి బ్యాట్స్‌మన్ హార్దిక్ తోమరె ఇదే మైదానంలో సాధన చేస్తూ కనిపించాడు.
కరోనా వైరస్ ముప్పుతో మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల క్రికెట్‌కు తెరపడింది. టీమ్‌ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా చాలామంది ఇంట్లోనే ఉండి కసరత్తులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అలరిస్తున్నారు. పేసర్ మహ్మద్ షమీ ఒక్కడే తన సొంత వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ కొనసాగిస్తున్నాడు.
ఇదీ చూడండి... 'చెస్ అంటే బోర్డ్‌పై కాదు.. ఆలోచనలపై గెలవాలి'