టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందని 2007లో బీసీసీఐ అడిగినప్పుడు.. తాను ధోనీ పేరు సూచించానని సచిన్ తెందుల్కర్ వెల్లడించారు. తొలి స్లిప్‌లో ఉండే తాను.. ధోనీలో మ్యాచ్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని గమనించానని చెప్పారు. సచిన్, ద్రవిడ్, గంగూలీ కెప్టెన్సీకి దూరంగా ఉండి 2007 ప్రపంచకప్ కోసం కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ.. సచిన్‌ను అడిగింది.
"అది ఎలా జరిగిందన్న వివరాల్లోకి నేను వెళ్లాలనుకోవట్లేదు. అయితే నన్ను అడిగినప్పుడు(బీసీసీఐలో సీనియర్లు) కెప్టెన్సీ గురించి నేను అనుకుంటున్నది చెప్పా. చిన్న చిన్న గాయాలు ఉండడం వల్ల నేను దక్షిణాఫ్రికా వెళ్లనని చెప్పా. అయితే అప్పట్లో నేను స్లిప్ వలయంలో ఉండేవాణ్ని. ఫీల్డింగ్ ఏర్పాటు తదితర అంశాల గురించి ఎంఎస్‌తో మాట్లాడుతూ అతడి ఆలోచనలు అర్థం చేసుకునేవాణ్ని. అతడు మ్యాచ్‌ను అర్థం చేసుకునే తీరును దగ్గరగా గమనించా. ధోనీకి మంచి క్రికెట్ బుర్ర ఉందని అర్థమైంది. బోర్డుకు అదే విషయం చెప్పా. ధోనీనే తర్వాతి కెప్టెన్‌ను చేయాలని సూచించా"
-- సచిన్ తెందుల్కర్, భారత దిగ్గజ క్రికెటర్
తన నిర్ణయాలపై ఎవరినైనా ఒప్పించే ధోనీ సామర్థ్యం.. తనను బాగా ఆకట్టుకుందని లిటిల్ మాస్టర్ తెలిపారు.
"నా ఆలోచనలు, అతడి ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉండేవి. దేని గురించైనా ఎవరినైనా ఒప్పించాలంటే ఇద్దరి ఆలోచనా సరళి ఒకేలా ఉండాలి. నాకు ఎంఎస్ విషయంలో అదే జరిగింది. మేమిద్దరం ఒకేలా ఆలోచించేవాళ్లం. అందుకే తర్వాతి కెప్టెన్‌గా ధోనీ పేరు సూచించా" అని సచిన్ పేర్కొన్నారు.
కెప్టెన్‌గా ధోనీ తన ఆటగాళ్లకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాడని సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డారు.
"ఓ ఆటగాడి సామర్థ్యంపై కెప్టెన్‌కు నమ్మకముంటే అతడి ఆటే వేరుగా ఉంటుంది. ఈ తరంలోనే కాదు అన్ని తరాల్లోనూ ఆటగాళ్లకు కెప్టెన్ మద్దతు కావాలి. అది కచ్చితంగా ఉపయోగపడుతుంది. ధోనీ జట్టులో ఎంతో మంది ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాడు. అది జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగించిందనడంలో సందేహం లేదు" అని అన్నారు మాస్టర్.