క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇటీవల అభిమానులను ఓ సాయం కోరాడు. తన మొదటి కారు మారుతీ 800ను వెతకటంలో సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. దానితో తన అనుబంధం ప్రత్యేకమైందని.. ఎవరికైనా అది కనిపించినట్లయితే తనను సంప్రదించాలని కోరాడు. ప్రస్తుతం అది తన వద్ద లేదని.. దానిని తన వద్దకు తెచ్చుకోవాలని ఉందన్నాడు. కార్లంటే చాలా ఇష్టపడే సచిన్.. తాను ప్రొఫెషనల్ క్రికెటర్ అయన తొలినాళ్లలో ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత క్రికెట్‌లో శిఖర స్థాయికి చేరుకున్నాక తన తొలి కారును అమ్మేశాడు.
కార్ల మీద అభిమానం ఇలా!
చిన్నప్పుడు వారి ఇంటికి దగ్గరగా ఓ ఓపెన్-డ్రైవ్ సినిమా హాలు ఉండేదట. అక్కడ సినిమాలు చూసేందుకు ముంబయిలోని అనేక మంది వచ్చేవారట. వారు తమ కార్లలో కూర్చుని అక్కడ సినిమా చూసేవారు. ఈ దృశ్యాన్ని సచిన్, ఆయన సోదరుడు వారి ఇంటి బాల్కనీ నుంచి చూసేవారు. ఆ విధంగా గంటల తరబడి రకరకాల కార్లను చూడటం వల్ల.. తనకు వాటిపై ఇష్టం పెరిగిందని సచిన్ చెప్పుకొచ్చాడు.