భారత మహిళా క్రికెటర్లకు అపూర్వ అవకాశం. తొలిసారి ప్రపంచకప్ కలను సాకారం చేసుకోడానికి వేయాల్సింది మరో అడుగు మాత్రమే. టీమిండియా తొలిసారి టీ20 ప్రపంకచప్ ఫైనల్కు చేరిన నేపథ్యంలో భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్.. మన క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయక సందేశమిచ్చాడు. ఆదివారం జరిగే తుదిపోరులో గెలిచి, దేశానికి కప్పు తేవాలని ఆకాంక్షించాడు.
" గతంలో ఓ సారి ఆ ట్రోఫీతో నేను, మహిళా జట్టులోని అమ్మాయిలు ఉన్నపుడు వాళ్లతో మాట్లాడా. ఈ ట్రోఫీతో మీరు భారత్‌కు వస్తే చూడడం ఆనందంగా ఉంటుందని చెప్పా. అది నిజం కావాలి. మైదానానికి వెళ్లి మీ ఆట ఆడండి. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించండి. బయట ప్రపంచం గురించి ఆలోచించకుండా, జట్టులో ఒకరికొకరు తోడుగా ఉంటూ సానుకూల విషయాలను మాట్లాడుకోవాలి. విజయం సాధించి దేశానికి కీర్తి అందించడమే అన్నింటికంటే ముఖ్యమైంది. వెళ్లి.. మీ ఆటను ఆస్వాదించండి"
-- సచిన్ తెందుల్కర్, దిగ్గజ భారత క్రికెటర్
ప్రపంచకప్‌లో మ్యాచ్‌లను చూస్తున్నానని, భారత అమ్మాయిలు యువతకు స్ఫూర్తినిస్తున్నారని సచిన్ ప్రశంసించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఢీకొంటుంది.