పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచింది ఇంగ్లాండ్. ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీతో రాణిస్తే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 71 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం మాట్లాడిన రాయ్.. మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన విషయాల్ని వెల్లడించాడు.
"ఈ సెంచరీ నాకు, నా కుటుంబానికి గుర్తుండిపోతుంది. మ్యాచ్ ముందురోజు రాత్రి 1:30కు నా కూతుర్ని ఆసుపత్రిలో చేర్పించాను. ఉదయం 8 గంటల వరకు అక్కడే ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత సరాసరి మైదానంలో దిగి సెంచరీ చేశాను. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసి కుదుటపడ్డాను." -జేసన్ రాయ్, ఇంగ్లాండ్ క్రికెటర్
నాటింగ్హమ్ వేదికగా జరిగిన ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 340 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 115 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫకార్ జమాన్, హఫీజ్ అర్ధసెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్.. జేసన్ రాయ్ (114 పరుగులు), బెన్ స్టోక్స్(71) మెరుపులతో మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది.
ఇది చదవండి: గ్రౌండ్లో హిట్ వికెట్... నెట్లో ట్రోల్ టార్గెట్