టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డేలో వీటిలో ఎన్ని బ్రేక్ అవుతాయో చూడాలి.
రోహిత్-ధావన్ భాగస్వామ్యం
భారత జట్టు స్టార్ ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఆస్ట్రేలియాపై వీరిద్దరు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పితే అరుదైన ఘనత సాధిస్తారు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన జోడీగా రికార్డు సృష్టిస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం వెస్టిండీస్ ఆటగాళ్లు గ్రీనిడ్జ్-హేన్స్ జంటతో (భారత్‌పై 6) కలిసి రోహిత్-ధావన్ సమంగా నిలిచారు. మూడో స్థానంలో ధోనీ- యువరాజ్ సింగ్ ఉన్నారు. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌పై 5 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
- ఆసీస్‌పై రోహిత్- ధావన్‌కు మంచి రికార్డు ఉంది. వీరిద్దరు కలిసి ఆసీస్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు చేశారు. శ్రీలంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్.. మంగళవారం మొదలయ్యే ఆసీస్ వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.
సింగిల్‌గానూ
ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో 10 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్‌కు ఇంకో 234 పరుగులు మాత్రమే అవసరం. అంతేకాకుండా 33 పరుగులు చేస్తే ఓపెనర్‌గా వన్డేల్లో 7 వేల మార్కును అందుకుంటాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఖాతాలో 6977 పరుగులు ఉన్నాయి.
పాంటింగ్ రికార్డుకు ఎసరు
వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సాధించిన పరుగులు 2037. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో 2 వేలకు పైగా పరుగులు చేసిన ముగ్గురు క్రికెటర్లలో హిట్‌మ్యాన్ ఒకడు. ఈ జాబితాలో సచిన్ తెందూల్కర్ (3,077), రికీ పాంటింగ్ (2,164) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్... 7 సెంచరీలు, 8 అర్ధశతకాలు సాధించాడు. కంగారూ జట్టుపై ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ మూడు అర్థ శతకాలు బాదాడు.
రోహిత్ వన్డే పరుగులు
వన్డే కెరీర్‌లో 214 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్... 8994 పరుగులు చేశాడు. మరో 6 రన్స్ చేస్తే 9 వేల మైలురాయిని అందుకుంటాడు. అత్యంత వేగంగా ఈ మార్కును చేరిన మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్ (205) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి వేదికగా తొలి మ్యాచ్, జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో ఆఖరి మ్యాచ్ జరగనుంది.