రోడ్డు భద్రతా అవగాహన (రోడ్ సేఫ్టీ అవేర్నెస్) కార్యక్రమంలో భాగంగా ముంబయిలో జరిగిన టీ20 ఎగ్జిబిషన్ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ -వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, బ్రియన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు మరోసారి బ్యాట్ పట్టి, మైదానంలో సందడి చేశారు.
వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. చంద్రపాల్ (61) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డారెన్ గంగా (32) ఫర్వాలేదనిపించాడు. దిగ్గజ ఆటగాడు లారా (17) తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు.
అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెంండ్స్ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫోర్ బాది మరోసారి వింటేజ్ సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చాడు వీరు. అభిమానులకు కనువిందు చేస్తూ ఓపెనర్లుగా దిగిన సెహ్వాగ్, సచిన్ మొదటి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అనంతరం సచిన్ 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కానీ సెహ్వాగ్ మాత్రం అర్ధసెంచరీతో (74) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఇండియా లెజెండ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.