భారత్, ఇంగ్లాండ్ మధ్య కీలక టెస్టు సమరానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్న ఈ జట్ల మధ్య.. తొలి మ్యాచ్ శుక్రవారమే ఆరంభమవనుంది. సొంతగడ్డపై ప్రత్యర్థిని చిత్తుచేయాలనే పట్టుదలతో ఉన్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు జోరుగా సాధన కొనసాగిస్తున్నారు. స్వదేశంలో.. పూర్తిగా అనుకూలమైన పరిస్థితుల్లో రూట్ సేనకు ఓటమి రుచి చూపించాలనే ధ్యేయంతో కోహ్లీసేన ఉంది.
అయితే అదంత సులభం కాదు. ఎందుకంటే భారత్ విసిరే సవాలును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ జట్టులో కీలక ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ప్రతిఘటించేందుకు సన్నద్ధమవుతున్నారు. వాళ్లను కట్టడి చేస్తేనే భారత్‌కు విజయావకాశాలుంటాయి. మరి సిరీస్‌లో భారత్‌కు సవాలు విసురుతారని భావిస్తున్న ఆ ఇంగ్లాండ్ యోధులెవరో చూసేద్దాం పదండి!
అతనే బలం..
కెప్టెన్‌గా జట్టును గొప్పగా నడిపించడంతో పాటు బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారిస్తున్న జో రూట్.. ఇంగ్లాండ్‌కు ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. ఇటీవల శ్రీలంకతో రెండు టెస్టుల్లోనూ బ్యాట్‌తో సత్తాచాటాడు. తొలి టెస్టులో ద్విశతకం బాదేసిన అతను.. రెండో మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాపైనా అతనికి మంచి రికార్డు ఉంది. 16 టెస్టుల్లో 56.84 సగటుతో 1421 పరుగులు చేశాడు. అందులో 4 శతకాలు, 9 అర్ధశతకాలున్నాయి. స్పిన్‌ను చక్కగా ఆడే అతను.. భారత్‌లో 6 టెస్టులాడి 53.09 సగటుతో 584 పరుగులు చేశాడు.
అనుభవమే ఆయుధం..
జేమ్స్ అండర్సన్.. వయసు పెరుగుతున్నా కొద్దీ బౌలింగ్‌లో దూకుడు పెంచుకుంటూ వెళ్తున్నాడీ సీనియర్ పేసర్. టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచిన ఈ 38 ఏళ్ల పేసర్‌పై టీమ్‌ఇండియా ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. పిచ్‌తో సంబంధం లేకుండా చెలరేగే జిమ్మీని మన బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. ఇటీవల భారత్ లాంటి పరిస్థితులే ఉండే శ్రీలంకతో రెండో టెస్టులో మాత్రమే ఆడిన అతను.. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తన టెస్టు కెరీర్‌లో అతను ఎక్కువ వికెట్లు తీసింది టీమ్‌ఇండియాపైనే. భారత్‌పై 27 టెస్టులాడిన అతను 25.98 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో 10 టెస్టులాడి 26 వికెట్లు తీశాడు.
బ్యాటుతో, బంతితో..
బ్యాట్స్‌మన్‌గా, పేసర్‌గా, ఫీల్డర్‌గా.. ఇలా జట్టుకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఉత్తమ ఆటగాడు స్టోక్స్. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజేతగా నిలిపిన అతను.. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లోనూ ఆస్ట్రేలియాపై చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో వికెట్లు పడగొడుతూ బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. భారత్‌తో ఆడిన 11 టెస్టుల్లో 545 పరుగులు చేసిన స్టోక్స్.. 29 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో సిరీస్ కోసం విశ్రాంతి తీసుకుని సరికొత్త ఉత్తేజంతో భారత్‌తో మ్యాచ్‌లకు సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ భారత్‌లో 5 టెస్టులాడిన అతను.. 345 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. బౌలింగ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
తన ముద్ర వేయాలని..
ఐపీఎల్‌లో ఆడడం వల్ల భారత్‌లోని పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్న ఆటగాళ్లలో బట్లర్, ఆర్చర్ ముందుంటారు. ముఖ్యంగా బట్లర్‌కు ఉపఖండ పరిస్థితులు కొట్టినపిండే అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌లో బ్యాట్‌తో రెచ్చిపోయే ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇప్పుడిక్కడ టెస్టుల్లోనూ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా పేరు సంపాదించుకున్న అతను.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.
శ్రీలంకతో చివరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించాడు. భారత్‌పై 11 టెస్టుల్లో 43.93 సగటుతో 703 పరుగులు చేశాడు. ఓ శతకం కూడా సాధించాడు. ఇప్పటికే భారత్‌లో ఓ సిరీస్(2016) ఆడిన అనుభవం ఉన్న అతను.. అప్పుడు 3 టెస్టుల్లో 154 పరుగులు చేశాడు. మరోవైపు భారత్‌తో ఇప్పటివరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని పేసర్ ఆర్చర్.. ఈ సిరీస్‌లో తన ఐపీఎల్ అనుభవంతో సత్తాచాటాలనే లక్ష్యంతో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో అతను ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లాడి 38 వికెట్లు పడగొట్టాడు.
గుర్తుందా 2012?
క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సొంతగడ్డపై టీమ్‌ఇండియాకు తిరుగులేదనేది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ప్రత్యర్థికి పరాజయం తప్పదు. మనకు అలవాటైన పరిస్థితుల్లో.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత ఆటగాళ్ల ఆధిపత్యం మామూలుగా ఉండదు. గత రెండు దశాబ్దాల్లో ఈ జోరు మరింత పెరిగింది. మరోవైపు విదేశాల్లోనూ మన జట్టు అద్భుతమైన ప్రదర్శనతో చారిత్రక విజయాలు సాధిస్తోంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్ ముందు భారత్ జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే గత 20 ఏళ్లలో స్వదేశంలో భారత్ ఓడిన మూడు టెస్టు సిరీస్‌ల్లో.. ఓ సిరీస్ ఓటమి ఇంగ్లీష్ జట్టు చేతిలోనే ఎదురైంది. 2000 నుంచి 2020 మధ్యలో స్వదేశంలో ఆడిన 35 టెస్టు సిరీస్‌ల్లో భారత్.. 27 విజయాలు సాధించింది. అయిదు సిరీస్‌లను డ్రాగా ముగించి.. మూడింట్లో ఓడింది. 2000లో రెండు టెస్టుల సిరీస్‌లో 0-2తో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్.. 2004లో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-2తో ఆస్ట్రేలియాతో ఓడింది. చివరగా 2012లో ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో పరాజయం చెందింది.
ఆ తర్వాత సొంతగడ్డపై ఇప్పటివరకూ భారత్ అన్ని సిరీస్‌ల్లో (2016లో అయిదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై 4-0తో సహా)నూ విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం రూట్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే సచిన్, గంభీర్, సెహ్వాగ్, పుజారా, కోహ్లి, యువరాజ్, ధోని, అశ్విన్, హర్భజన్, జహీర్, ప్రజ్ఞాన్ లాంటి ఆటగాళ్లున్న మేటి జట్టునే అప్పుడు ఇంగ్లాండ్ ఓడించింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత జట్టులో మార్పులు ఉన్నప్పటికీ.. ఇప్పుడూ మెరుగైన ఆటతీరే ప్రదర్శిస్తోంది టీమ్‌ఇండియా. ఈ నేపథ్యంలో వచ్చే సిరీస్‌లో ఏమరపాటు పడకుండా ప్రత్యర్థితో జాగ్రత్తగా తలపడాల్సిన అవసరం భారత్‌కు ఉంది.
ఇదీ చదవండి: 'వెనుక ఉండి కోహ్లీకి సహకరించడమే నా బాధ్యత'