ఇంగ్లాండ్ - వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే టోర్నీ 'ద హండ్రెడ్'. వంద బంతుల ఈ లీగ్‌కు ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. తొలి జాబితాలోనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొదటి ఆఫ్గాన్ క్రికెటర్‌గా నిలిచాడు. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీ ఈ బౌలర్‌ను తీసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు రషీద్ ఖాన్. టీ20ల్లో 12.03 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా వంద బంతుల టోర్నీ తొలి రౌండ్లోనే ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్, సదరన్ బ్రేవ్ తొలి డ్రాఫ్ట్‌లోనే ఎంపికయ్యారు. వీరితో పాటు ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను తీసుకుంది నార్తర్న్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీ.
గేల్‌కు దక్కని అవకాశం..
అయితే వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్‌గేల్‌ను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అతడి కనీస ధర ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. గేల్‌తో పాటు లసిత్ మలింగ, దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడాలను తొలి రౌండ్లో తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను లండన్ స్పిరిట్ జట్టు తీసుకోగా.. లియామ్ లివింగ్‌స్టన్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసుకుంది. మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్‌ను వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ తీసుకుంది.
తొలి రౌండ్లో ప్రతి ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను తీసుకుంది. ఎక్కువగా అంతర్జాతీయ క్రికెటర్ల వైపు మొగ్గుచూపాయి జట్లు. వచ్చే ఏడాది జులైలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: వైరల్: మ్యాచ్ మధ్యలో మైదానంలోకి అభిమాని