క్రికెటర్‌గా ఎదగాలంటే ఏకాగ్రత పెంచుకోవడం అవసరమని అంటున్నాడు ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్. అయితే ఓ క్రికెటర్ కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాడు. ఈ విషయంపై మాజీ ఆటగాడు డబ్ల్యూవీ రామన్ నిర్వహించిన ఓ షోలో తాజాగా మాట్లాడాడు.
"ఓ క్రికెటర్‌కు ఏకాగ్రత ఎంతో అవసరం. కృషితో దాని మెరుగుపర్చుకోవచ్చు. ఓ విజయవంతమైన క్రికెటర్‌గా ఎదగాలన్నా లేదా ఏ రంగంలోనైనా విజయం సాధించాలన్నా ఏకాగ్రతను పెంచుకోవడానికి కృషి చేయాలి. ఏకాగ్రతతో ఉండే సామర్థ్యం, ఆ క్షణంలో ఆ బంతి గురించే ఆలోచించడం చాలా ముఖ్యమైన నైపుణ్యం. అది నాకు సహజంగానే రావడం అదృష్టమనే చెప్పాలి. నెట్స్‌లో ఎన్నో సంవత్సరాలు నేను ఏక్రాగత పెంచుకోవడంపై దృష్టిపెట్టా. ఆడే అవకాశం వచ్చినప్పుడు ఏక్రాగత పెట్టగలగాలి లేదా సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలి. ఇదే అత్యుత్తమ మార్గమని చిన్నప్పుడు నాకు ఒకరు సలహా ఇచ్చారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి అది ఉపయోగపడుతుంది"
-రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఎన్ని వికెట్లు తీశాం లేదా ఎన్ని పరుగులు చేశామన్నది విజయానికి కొలమానం కాదని ద్రవిడ్ అన్నాడు. "అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించా" అని అనిపించాలి. అదే నిజమైన విజయం. కొన్నిసార్లు ఎక్కువ క్రికెట్ ఆడొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఆడొచ్చు. జీవితంలో మనం చేసింది ఏదైనా కావొచ్చు.. అంతా సవ్యంగా సాగాలంటే కాస్తా అదృష్టం కూడా కావాలి. మనం మనల్ని ఇతరులతో పోల్చి చూసుకోవడం సరికాదు. చివరికి ఇది మన ప్రయాణం. ఉన్నంతలో అత్యుత్తమంగా ఉండడానికి ప్రయత్నించాలి. క్రికెట్లో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బ్యాటింగ్‌లో క్రికెటర్ ఎక్కువసార్లు విఫలమవుతాడు. అర్ధశతకం సాధించడం విజయవంతం కావడం అనుకుంటే 50 దాటని ఇన్నింగ్స్‌లే కెరీర్‌లో ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో 50 సగటు ఉన్న ఆటగాడు విజయవంతమైన సందర్భాల కన్నా విఫలమైన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి" అని వివరించాడు.