వర్ణ, జాతి వివక్షను పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు. ఇందులో భాగంగా 31 మంది మాజీ, అంతర్జాతీయ క్రికెటర్లు ఓ లేఖపై సంతకాలు చేశారు. ఈ మేరకు పేసర్ లుంగి ఎంగిడి మొదలు పెట్టిన బ్లాక్ లివ్స్ మ్యాటర్ పోరాటానికి తమ మద్దతు తెలిపారు. ఇందులో జేపీ డుమిని, గిబ్స్ వంటి స్టార్లు ఉన్నారు. ఐదుగురు కోచ్లు కూడా లేఖపై సంతకం చేశారు. జాతి భేదం లేదని తెలిపేందుకు ఇదే నిదర్శనమని వెల్లడించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
గతంలో ఎంగిడి పోరాటంపై పాట్ సిమ్కాక్స్, బొయోటా డిప్పేనార్, రుడీ స్టెయిన్, బ్రియాన్ మెక్మిలన్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం బ్లాక్ లివ్స్ ఉద్యమం మళ్లీ జోరందుకుంది. ఇంగ్లాండ్-విండీస్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులోనూ ఇరుజట్ల ఆటగాళ్లు మోకాళ్లపై ఉండి జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.