దేశ అత్యున్నత క్రీడా పురస్కారాల నగదు బహుమతులను కేంద్రం భారీగా పెంచాలని యోచిస్తోంది. ఇదివరకు ఉన్న ప్రైజ్‌మనీతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోందట.
ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు సర్టిఫికెట్, రూ.7.5 లక్షలు నగదుని బహుమతిగా అందజేస్తున్నారు. దీన్ని రూ. 25 లక్షలకు పెంచాలని భావిస్తోందట కేంద్రం. అలానే అర్జున అవార్డు గ్రహీతలకు జ్ఞాపికతో పాటు రూ.5 లక్షలు నగదు అందజేస్తుండగా.. ఈ బహుమతిని రూ. 15 లక్షలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ఆగస్టు 29 తుది నిర్ణయం ప్రకటిస్తారు.
ఖేల్‌రత్నకు ఐదుగురు పేర్లు ఫైనలైజ్
ఈ ఏడాది దేశ అత్యుత్తమ క్రీడాపురస్కారం ఖేల్‌రత్న కోసం భారత క్రికెటర్ రోహిత్ శర్మ సహా మరో నలుగురు ప్లేయర్‌ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది సెలక్షన్ కమిటీ. హిట్‌మ్యాన్‌తో పాటు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టీటీ ప్లేయర్ మనికా బత్రా, పారా ఒలంపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, హాకీ ప్లేయర్ రాణీ రాంపాల్ ఈ జాబితాలో ఉన్నారు. 2016 తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న కోసం ఐదుగురు ఆటగాళ్లను సిఫారసు చేయడం ఇదే తొలిసారి.
సెలక్షన్ కమిటీలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ ఉన్నారు.