ప్రపంచంలో కొందరు క్రీడాకారులకు ఆదరణ మామూలుగా ఉండదు. కోట్లాది మంది అభిమానులు, సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వారి సొంతం. భారత్‌లో క్రికెటర్లపై ఉన్న అభిమానం అయితే చెప్పనక్కర్లేదు. సచిన్‌ను క్రికెట్ దేవుడిగా అభివర్ణించే దేశం మనది. ప్రస్తుతం ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు మంచి ఫాలోయింగ్ ఉంది. వారి పేర్లతో రెస్టారెంట్లు, దుకాణాలు, మాల్స్ లాంటివీ ఉన్నాయి. అలాగే కొంతమంది క్రికెటర్లకు సొంత బిజినెస్‌లూ ఉన్నాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు కలిగి ఉన్న మన క్రికెటర్లను చూద్దాం.
రవీంద్ర జడేజా- (జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్- రాజ్‌కోట్)
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు రవీంద్ర జడేజా. ఇతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సొంత వ్యాపారాలపైనా జడ్డూకు మక్కువ ఎక్కువే. అందుకే 2012లో రాజ్‌కోట్‌లో 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఈ తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంది. 12-12-2012 రోజున తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించడం విశేషం. ఈ రెస్టారెంట్‌కు రేటింగ్ కూడా బాగానే ఉంది.
విరాట్ కోహ్లీ (యుఇవా- దిల్లీ)
ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ప్రకటనలతో అత్యధికంగా ఆర్జిస్తోన్న భారతీయ క్రీడాకారుడిగా ఉన్నాడు. ఈ ఆటగాడికి సొంత వ్యాపారాలపైనా మోజు ఎక్కువే. అందులో భాగంగా 'యుఇవా' పేరుతో దిల్లీలో ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌ను 2017లో ప్రారంభించాడు కోహ్లీ. రెస్టారెంట్‌కు తరచుగా వచ్చే వారు కోహ్లీ దిల్లీలో ఉన్నప్పుడు అతడిని కలుసుకునే అవకాశం కూడా ఉంది.
కపిల్ దేవ్ (కపిల్ దేవ్స్ ఎలెవన్స్-పట్నా)
1983లో ఇండియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా కపిల్ దేవ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఈ పేరు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ ఆటగాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కపిల్ 2008లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. పట్నాలో ఉన్న ఈ రెస్టారెంట్ క్రికెట్ థీమ్‌తో ఏర్పాటైంది.
జహీర్ ఖాన్ (జేకేస్-పుణె)
బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు జహీర్ ఖాన్. తన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలను అందించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ ఆటగాడికి ఓ విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. పుణెలో 'జేకేస్' పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు జహీర్. విజయాన్ని అందుకున్నాడు. ఖరీదు ఎక్కువైనా కస్టమర్లు పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తుందని అక్కడి వారి అభిప్రాయం.
జయవర్ధనే, సంగక్కర (మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్స్- కొలంబో)
శ్రీలంక క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లుగా పేరు పొందారు జయవర్ధనే, సంగక్కర. ఈ ఇద్దరూ ఆన్ఫీల్డ్లోనే కాక ఆఫ్‌ఫీల్డ్‌లోనూ మంచి మిత్రులు. వీరి భాగస్వామ్యాలతో లంక జట్టు ఎన్నో మ్యాచ్‌లు గెలిచింది. అదే స్నేహాన్ని కొనసాగిస్తూ వీరు కొలంబోలో ఓ లగ్జరీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 'మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్స్' పేరుతో మొదలైన ఈ రెస్టారెంట్ సీఫుడ్‌కు ఫేమస్. ముఖ్యంగా అనేక రకాల పీతలు ఇక్కడ నోరూరిస్తాయి.