ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. భారత్‌పై వ్యక్తపర్చిన ప్రేమకు ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సోమవారం దక్షిణాఫ్రికాలోని జోహెనస్‌బర్గ్‌కు విమానంలో కరోనా టీకాలు పంపించింది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఇది చూసిన పీటర్సన్.. భారత ప్రభుత్వం ఔదార్యాన్ని కొనియాడాడు.
'భారత దేశం ఉదారత, దయగల గుణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎంతో ప్రియమైన దేశం' అని ప్రశంసించాడు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. "భారత్ పట్ల మీకున్న ప్రేమను చూడటం అమితానందం. ప్రపంచమంతా మా కుటుంబమనే భావిస్తాం. అలాగే కొవిడ్-19పై పోరాటంలో మా వంతు సాయం అందిస్తాం" అని మోదీ పేర్కొన్నారు.
పీటర్సన్ వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు.
మరోవైపు వచ్చేనెలలో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేయడాన్ని ఈ ఇంగ్లాండ్ మాజీ సారథి తప్పుపట్టాడు. దక్షిణాఫ్రికా బదులు భారత పర్యటన అయితే ఆసీస్ ఇలా చేసేది కాదన్నాడు. క్రికెట్‌లో ఇది మంచిది కాదని, తమ జట్టు కూడా దక్షిణాఫ్రికాతో రద్దు చేసుకుందని పీటర్సన్ పేర్కొన్నాడు. అయితే, శ్రీలంక పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడినా అక్కడ దిగ్విజయంగా సిరీస్ పూర్తి చేసినట్లు గుర్తుచేశాడు. కాగా, ఆసీస్ నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా బోర్డు అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా చివరి నిమిషంలో ఇలా చేయడం బాగోలేదని, ఇది తమకు ఆర్థికంగానూ నష్టం చేస్తుందని బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'బుడగలో కష్టమే.. కానీ తప్పదు'