బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు కృతిమ పదార్థాన్ని అనుమతించలేమని స్పష్టం చేశారు ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అనిల్ కుంబ్లే. బ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు. బంతిపై ఉమ్మి రుద్దకుండా ఆడాలంటే కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ తాత్కాలికంగా నిషేధించింది. బంతిని స్వింగ్ చేయాలంటే మరో ప్రత్యామ్నాయ పదార్థాన్ని అనుమతించాలని జస్ప్రీత్ బుమ్రా సహా చాలా మంది పేసర్లు కోరుతున్నారు. లేదంటే బ్యాటు, బంతి మధ్య పోటీ సమానంగా ఉండదని అంటున్నారు. వీరి వాదనతో కుంబ్లే ఏకీభవించలేదు.
"క్రికెట్లో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లను రూపొందించి బంతి, బ్యాటుకు మధ్య సమతూకం తీసుకురావొచ్చు. పిచ్‌పై పచ్చికను ఉంచొచ్చు. సంప్రదాయ స్వింగ్, రివర్స్ స్వింగ్‌కు అనుకూలించకపోతే ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు. వన్డే, టీ20ల గురించి ఎవరికీ ఆందోళన లేదు. టెస్టుల విషయంలోనే ఈ ఆవేదన. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లతో ఆడించడం జరగదు. ఇప్పుడెందుకు ఇద్దరు స్పిన్నర్లను ఆడించొద్దు?"
-- అనిల్ కుంబ్లే
ఉమ్మికి ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఉపయోగించొచ్చు గానీ అది ఆటలో సృజనాత్మకతను చంపేస్తుందని కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఉమ్మి లేకుండా అలవాటు పడేందుకు ఆటగాళ్లకు ఇబ్బంది ఉంటుందన్నారు. క్రికెట్ తిరిగి ప్రారంభమైతే బౌలర్లు సన్నద్ధమయ్యేందుకు సమయం పడుతుందన్నారు. వేర్వేరు దేశాల్లో వేర్వేరు పరిస్థితులు ఉంటున్న దృష్ట్యా.. క్రికెట్‌ను పునః ప్రారంభించేందుకు వివరణాత్మక మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు.
మూడు నెలలుగా సాధన లేకపోవడం వల్ల క్రికెటర్లు ఫిట్నెస్ సహా ఆటపై పట్టు తగ్గే అవకాశం ఉందన్నారు. వారి శారీరక, మానసిక పనిభారాన్ని అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాలని కుంబ్లే సూచించారు.