ప్రపంచకప్ సమరంలో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన పాక్... లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కోచ్ పదవిపై ఇప్పటివరకు కొనసాగిన సందిగ్ధానికి తెరదించింది. జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ కాంట్రాక్టును పునరుద్ధరించడం లేదని తేల్చి చెప్పింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, సహాయక సిబ్బందికి వీడ్కోలు పలకనుంది.
"జట్టు సహాయ సిబ్బంది కోసం కొత్తగా నియామకాలను చేపట్టనున్నాం. ప్రధాన కోచ్ ఆర్థర్, బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్, శిక్షకుడు గ్రాంట్ లూడెన్ కాంట్రాక్టులు పునరుద్ధరించడం లేదు. ఈ పదవులను భర్తీ చేసేందుకు త్వరలో ప్రకటన జారీ చేస్తాం. పాత వారిని కొనసాగించకూడదని బోర్డు సమావేశంలో నిర్ణయించాం." -పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పైనా వేటు పడే అవకాశాలున్నాయి. దీనికి కారణం కోచ్ ఆర్థర్ మెగా టోర్నీ అనంతరం ఇచ్చిన నివేదికలో సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తప్పించాలని కోరడమే.
ఇది చదవండి: 'లెగ్ నోబాల్' నిర్ణయం థర్డ్ అంపైర్ చేతుల్లో...!