మొదటి టెస్టులో చివరికి విజేత ఇంగ్లాండే కావొచ్చు కానీ పాకిస్థానూ గట్టిగానే తలపడింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో తనూ విజయావకాశాలను సృష్టించుకుంది. అందుకే ఓడినా ఆత్మవిశ్వాసంతో ఉంది. సిరీస్‌లో బోణీతో ఇంగ్లాండ్ కూడా ఉత్సాహంగానే ఉంది. ఈ నేపథ్యంలో మరో పోరాటానికి రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచే సౌథాంప్టన్‌లో రెండో టెస్టు జరగనుంది. మరి పాక్ పుంజుకుని సిరీస్‌ను నిర్ణయాత్మక టెస్టుకు తీసుకెళ్తుందా లేదా మళ్లీ ఇంగ్లాండే పైచేయి సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందనేది చూడాలి.
పట్టుదలగా పాక్:
తొలి మ్యాచ్‌లో చాలా భాగం మెరుగైన స్థితిలో నిలిచినా తొలి టెస్టులో ఓటమి పాకిస్థాన్‌కు నిరాశ కలిగించేదే. 277 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ను 117/5కే పరిమితం చేసినా పాక్ పట్టు విడిచి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తప్పులను పునరావృతం చేయొద్దన్న పట్టుదలతో ఆ జట్టు రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మసూద్ సూపర్ ఫామ్ పాక్‌కు గొప్ప సానుకూలాంశం. బాబర్ అజామ్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. షహీన్ అఫ్రిది, మహ్మద్ అబ్బాస్, నసీమ్ షా, యాసిర్ షాలతో పాక్ బౌలింగ్ బాగానే ఉంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సిరీస్‌కు దూరం కావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమే. కుటుంబ కారణాలతో స్టోక్స్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
వర్షం ముప్పు:
మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అంతరాయాలు తప్పకపోచ్చు ఇక్కడ ఇంగ్లాండ్, విండీస్ మధ్య జరిగిన టెస్టులో పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలించింది. క్రమంగా నెమ్మదించిన పిచ్.. స్పిన్నర్లకు సహకరించింది.