ఓటముల పరంపరను కొనసాగిస్తూ, 2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే టాస్ నుంచి తడబడటం వల్లే ఈ మ్యాచ్‌ను పాక్ కోల్పోయిందని ఆ దేశ మాజీ బౌలర్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆ రోజుకు జరిగిన విషయాలు తన మనసులో ఇంకా అలానే ఉన్నాయని చెప్పాడు. దీనితో పాటే టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పరుగులు చేయడాన్ని ఆపలేకపోవడం ఓటమికి మరో కారణమని అన్నాడు.
"ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో పాక్, టాస్ ఎంపిక దగ్గర నుంచే తడబడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. ప్రత్యర్థి జట్టులో టాప్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసి, వారిపై ఒత్తిడి తీసుకురావాలని భావించింది. కానీ బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓ దశలో వారిని నియంత్రించడం చాలా కష్టమైంది. నాకు తెలిసి టాస్ ఎంచుకోవడంలో విఫలమైన పాక్, భారత్ గెలవడానికి అవకాశం ఇచ్చినట్లు అయింది"
- వకార్ యూనిస్, పాకిస్థాన్ బౌలింగ్ కోచ్
![Pakistan got it wrong against India right from toss in 2019 World Cup: Waqar Younis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7684303_3.jpg)
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో 89 పరుగుల తేడాతో దాయాది జట్టు ఓటమి పాలైంది. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఏడోసారి పాక్ జట్టుపై గెలిచి రికార్డు సృష్టించింది.
మెగాటోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. 2003 ప్రపంచకప్‌లో పాక్‌పై సచిన్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలవడం విశేషం.
ఇదీ చూడండి... 'ఆ మ్యాచ్ కోసం బౌలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'