టీమ్‌ఇండియా పేసర్ బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని, అతడిని బాగా చూసుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ నుంచి అతడు ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్నాడని అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లకు అతడిని ఆడించడం సరికాదని తెలిపాడు.
'బుమ్రా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీర్ఘ కాలంలో అతడే ప్రధాన పేసర్‌గా టీమ్‌ఇండియాను నడిపిస్తాడు. కాబట్టి అతడు ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు ఉమేశ్, షమి, ఇషాంత్ ఫిట్‌గా లేరని తెలుసు. అంత మాత్రాన బుమ్రాను నాలుగు టెస్టుల్లో ఆడించడం సరికాదు. ఇప్పటివరకు అతడు స్వదేశంలో టెస్టు క్రికెట్ ఆడనేలేదు. కాబట్టి టీమ్‌ఇండియా అతడి విషయంలో జాగ్రత్తగా ఉందనే అనుకుంటున్నా' అని గంభీర్ పేర్కొన్నాడు.
టీమ్‌ఇండియా బుమ్రాను కేవలం విదేశాల్లోనే ఆడించిందని, ఈ పేస్‌గుర్రం అక్కడ తన ప్రతాపం చూపించిందని గౌతీ అభిప్రాయపడ్డాడు. అయితే, బుమ్రా భారత్‌లో అదరగొట్టలేడని తాను అనడం లేదన్నాడు. ఇక్కడ మరింత ప్రమాదకరంగా రాణిస్తాడని చెప్పాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరు క్రీజులో ఉన్నా ఔట్ చేయగల సమర్థుడని గంభీర్ ప్రశంసించాడు.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో బుమ్రా ఆడడం లేదు. పొత్తి కడుపులో అతడికి నొప్పిగా ఉందని తెలిసింది. బదులుగా నటరాజన్‌ను తుది జట్టులోకి వచ్చే వీలుంది.
ఇవీ చదవండి: