మార్చి 16.. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే.. ప్రపంచ క్రికెట్లో అప్పటివరకు కలగా ఉన్నటువంటి వంద సెంచరీల రికార్డును టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ చేరుకున్న రోజది. సచిన్‌కు ముందు.. సచిన్‌కు తర్వాత అన్న మాటను మరోసారి నిజం చేస్తూ.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గర్వపడేలా చేస్తూ.. చరిత్రను తిరగరాస్తూ మాస్టర్ సాధించిన ఆ శతకం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని ఘట్టం.
బంగ్లాపై రికార్డు
ఆసియా కప్-2012లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ సెంచరీతో మెరిశాడు. మొత్తం 114 పరుగులతో సత్తాచాటాడు. ఈ శతకం సచిన్‌కు వన్డేల్లో 49వది. అలాగే అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేయడం వల్ల ప్రపంచ క్రికెట్లో 100 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు తెందూల్కర్.
భారత్ ఓటమి
సచిన్ సెంచరీ చేసినా కూడా ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 290 పరుగులు చేయగా.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లా జట్టు.
సచిన్ రికార్డులు
- సచిన్ కెరీర్లో 164 అర్ధసెంచరీలు ఉన్నాయి.
- సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితాలో 71 శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు రికీ పాంటింగ్. కోహ్లీ 70 సెంచరీలతో ఉన్నాడు.
- తన 24 ఏళ్ల కెరీర్లో మొత్తం 34, 357 పరుగులు సాధించాడు సచిన్
- ప్రపంచ క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్.