ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు టెస్టుల్లో రన్‌మెషీన్‌గా పేరు సంపాదించాడు మార్నస్ లబుషేన్. ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రత్యర్థి ఏదైనా తనదైన శైలిలో ఆకట్టుకున్న లబుషేన్.. అన్నింటి కంటే భారత్‌లో ఆడటం కష్టమంటున్నాడు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడే అత్యుత్తమ ప్రదర్శన చేయొచ్చని చెప్పాడు.
"ఎప్పుడైనా భారత్‌తో ఆడటం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారిది బలమైన జట్టు. గొప్ప బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఆ జట్టు సొంతం. ఇది సవాల్‌గా అనిపించనుంది. ప్లేయర్‌గా ఎప్పుడూ బలమైన ప్రత్యర్థితో ఆడాలని కోరుకుంటా" - మార్నస్ లబుషేన్, ఆసీస్ క్రికెటర్
14 టెస్టుల అనుభవమున్న లబుషేన్ టెస్టుల్లో మూడో స్థానానికి చేరడం పట్ల స్పందించాడు. ఇంకా తాను నేర్చుకోవాల్సి చాలా ఉందని తెలిపాడు.
"చాలా మంది గొప్పగా ఆడానని అంటున్నారు. కానీ నేను చేయాల్సింది ఎంతో ఉంది. గత ఐదారేళ్ల నుంచి కేన్ విలియమ్సన్, కోహ్లీ, స్మిత్ లాంటి వారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఏదో ఒక్క సీజన్లో బాగా ఆడినంత మాత్రానా గొప్ప ఆటగాడినైపోను. ఇంకా నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తూ.. ఆసీస్‌కు విజయాలు అందించాలనుకుంటున్నా" -మార్నస్ లబుషేన్, ఆసీస్ క్రికెటర్.
లబుషేన్ ఇప్పటివరకు 14 టెస్టులాడి 63.43 సగటుతో 1,459 పరుగులు చేశాడు. ఇందులో ఓ ద్విశతకం సహా 4 శతకాలు 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. జనవరి 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది ఆస్ట్రేలియా. ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు లబుషేన్. ముంబయి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే ఈ నెల 17న రాజ్‌కోట్‌లో.. మూడో మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరులో జరగనుంది.
ఇదీ చదవండి: సిక్కుల సాయంతో కార్చిచ్చు బాధితులకు యువీ తోడ్పాటు