ఐసీసీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఖరారు చేయడమే ఏకైక ఎజెండాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి, సోమవారం వర్చువల్‌గా సమావేశం కానుంది. ఎన్నిక అయినా లేదా ఏకగ్రీవమైనా మొత్తం ప్రక్రియ నాలుగు వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నారు. "సోమవారం జరిగే సమావేశం ఎజెండాలో నామినేషన్ ప్రక్రియ మాత్రమే ఉంది. సాధారణంగా నామినేషన్లు దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇస్తారు" అని ఓ బీసీసీఐ సీనియర్ సభ్యుడు చెప్పాడు.
సాధారణంగా ఐసీసీ ఛైర్మన్‌కు మూడింట రెండొంతుల ఆధిక్యం అవసరం. కానీ కొంతమంది సభ్యులు సాధారణ మెజారిటీ ఉండాలని కోరే అవకాశముంది. ఐసీసీ బోర్డులో ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 17. 12 టెస్టు దేశాలతో పాటు అనుబంధ దేశాలు (మలేసియా, స్కాట్లాండ్, సింగపూర్), ఛైర్మన్ (ప్రసుత్తం తాత్కాలిక ఛైర్మన్), ఇండిపెండెంట్ డైరెక్టర్ (ఇంద్ర నూయి)లకు ఓటింగ్ హక్కులు ఉన్నాయి. ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ కూడా బోర్డులో సభ్యుడే. కానీ అతడికి ఓటు హక్కు లేదు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ పడాలంటే కనీసం రెండు శాశ్వత సభ్య దేశాల మద్దతు ఉండాలి. ఇప్పటి వరకైతే ఐసీసీ ఛైర్మన్‌పై ఏకాభిప్రాయం రాలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కోలిన్ గ్రేవ్స్.. శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో ముందున్నాడు. క్రికెట్ వెస్టిండీస్ మాజీ అధిపతి డేవ్ కామెరాన్, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా (సింగపూర్) కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందరి కళ్లూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వైపే. బీసీసీఐ అతణ్ని ఐసీసీకి పంపాలనుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం. తప్పనిసరి విరామ నిబంధన ప్రకారం గంగూలీ పదవీకాలం ముగిసింది. ఆ నిబంధనను తొలగించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 17న విచారించనుంది. 48 ఏళ్ల గంగూలీ బీసీసీఐని వదిలేయాల్సి వస్తే.. అతణ్ని ఐసీసీకి పంపడానికి బోర్డుకు అభ్యంతరమేమీ ఉండకపోవచ్చు.