క్రికెట్లో ఆటగాళ్లకు మాదిరే అంపైర్లూ ఫామ్‌లో ఉంటారని నితిన్ మేనన్ అంటున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత తొలిసారి భారత్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అతను.. కచ్చితత్వంతో కూడిన నిర్ణయాలతో అందరి ప్రశంసలు పొందాడు. ఇండోర్‌కు చెందిన 37 ఏళ్ల నితిన్.. గతేడాది జూన్‌లోనే ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికయ్యాడు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా.. నాలుగు టెస్టుల్లో, అయిదు టీ20లకు గాను మూడు మ్యాచ్‌ల్లో, మూడు వన్డేల్లో నితిన్ విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఐపీఎల్-14వ సీజన్‌కు సిద్ధమవుతున్న అతను చెన్నైలో క్వారంటైన్లో ఉన్నాడు.
"గత రెండు నెలలు గొప్పగా నడిచాయి. మనం సమర్థంగా చేసిన పనిని ప్రజలు గుర్తించి, అభినందిస్తే గొప్ప సంతృప్తి కలుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య సాగిన సిరీస్ సవాలు విసిరింది. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌కు వచ్చేసరికి ప్రపంచంలోనే ఇంగ్లాండ్, భారత్ ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. మా అంపైరింగ్ బృందం మంచి ప్రదర్శన చేసిందనే ఆనందంతో ఉన్నా" అని వెంకట్రాఘవన్, సుందరం రవి తర్వాత ఎలైట్ జాబితాలో చేరిన భారత మూడో అంపైర్‌గా నిలిచిన నితిన్ తెలిపాడు.
ఈ సిరీస్‌లో నితిన్ గొప్ప నిలకడ ప్రదర్శించాడు. తన 40 నిర్ణయాలను సవాలు చేస్తూ కెప్టెన్లు సమీక్ష కోరగా అందులో కేవలం 5 మాత్రమే వ్యతిరేకంగా వచ్చాయి. ఇక ఎల్బీల విషయంలో 35 సమీక్షలకు గాను రెండు మాత్రమే ప్రతికూలంగా వచ్చాయి.
"అంపైరింగ్ అనేది మానసికంగా ఎంత ధృడంగా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే ధ్యాస అంత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిలోనూ మేం చేసే మంచి ప్రదర్శన మా మానసిక బలాన్ని చాటుతుంది. వరుసగా మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తించడం నాకు కొత్తేమీ కాదు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడింది. ఆటగాళ్లలాగే అంపైర్లూ ఫామ్‌లో ఉంటారు. నేను మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి విరామం లేకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లకు పనిచేయాలని అనుకుంటా. అంపైర్‌గా నా పనిని ఆస్వాదిస్తుంటా. ఒకవేళ అలా చేయకపోతే అది నా ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. అలాగే మ్యాచ్‌ను ఆస్వాదించడం వల్ల ఒత్తిడి తగ్గించుకుంటా" అని అతడు చెప్పాడు. బయో బబుల్‌లో ఉండడం కష్టమేనని, అయితే ఒకరికొకరం సహకరించుకుంటూ కుటుంబం లాగా కలిసి సాగుతున్నామని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మ్యాచ్ రిఫరీగా జవగళ్ శ్రీనాథ్ ఉండడం తమ అదృష్టమని నితిన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: కొత్త కెప్టెన్.. ట్రోఫీ అందించేనా?