భారత్ క్రికెట్లో ఇటీవలే గులాబి బంతితో టెస్టు చూశాం. అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా టెస్టుల్లో జెర్సీలపై నంబర్లూ చూశాం. ఎంతో కొత్తగా అనిపించింది. మరి పురుషులు, మహిళలు క్రికెట్ ఆడితే బావుంటుందని కొందరు అంటే, సూపర్ సిరీస్ అని మరో ఆలోచనను తీసుకొచ్చాడు గంగూలీ. మరి అవి వార్తల్లో వచ్చినా అమల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాంటి తరహాలో వినడానికి కాస్త వినూత్నంగా, అమలు చేస్తే ఏం జరుగుతుందా అని ఆసక్తిగా అనిపించే కొన్ని విషయాలు.. కనీసం ఈ ఏడాదిలో అయినా ఆమోదం పొందుతాయేమో చూడాలి.
1. గంగూలీ 'సూపర్ సిరీస్'...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ 'వన్డే సూపర్ సిరీస్' అనే సరికొత్త ఆలోచనలో ముందుకొచ్చాడు. ఇందులో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో దేశంతో కలిపి 2021 నుంచి ప్రతి ఏటా "నాలుగు దేశాల టోర్నీ" ఆడాలన్నది దాదా ప్రతిపాదన. దీనిపై ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపాడు గంగూలీ. ఇవన్నీ ఈ ఏడాది ఓకే అయితే 2021లో మ్యాచ్‌ల నిర్వహణకు ముందడుగు పడనుంది.
2. బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులు...
భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ... 2019లో జరిగిన తొలి సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)లో బీసీసీఐ రాజ్యాంగ్యంలో కొన్ని మార్పులు సహా లోధా సంస్కరణలపై చర్చించాడు. అతడి అధ్యక్షతన జరిగిన తొలి ఏజీఎమ్‌లో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులూ ఆమోదం తెలిపారు. ఇక మిగిలింది అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆమోదం తెలపడమే.
- ఆరేళ్లకు విరామం ఉండదిక..!
ఈ సరికొత్త విధానానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఇక ఉండదు. బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన దాదా.. తొమ్మిది నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదివిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అతడితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు. బీసీసీఐ పాలనలో అడుగడుగున అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చరమగీతం పాడినట్లే.
- విరుద్ధ ప్రయోజనం...
పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై గంగూలీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని నిబంధనలు రద్దు లేదా సవరణ సుప్రీం చేతుల్లోనే ఉంది. వీటిపై అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకుంటే జట్టుకు మాజీ క్రికెటర్ల సలహాలు, సూచనలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు పదవుల్లో ఉన్న ఆటగాళ్లకు ఇది ఇబ్బందిగా మారింది.
ఆటగాడు-వ్యాఖ్యాత, వ్యాఖ్యాత-ఐపీఎల్-ఫ్రాంచైజీ సిబ్బంది, వ్యాఖ్యాత-పాలకుడు-ఫ్రాంచైజీ మార్గనిర్దేశకుడు, బీసీసీఐ పదవి-ఐపీఎల్ ఫ్రాంచైజీ ఉద్యోగి వంటి అంశాల్లో ప్రస్తుతం ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గంగూలీ సహా మరెంతో మంది పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన నోటీసులు అందుకున్నారు. దీనిపై ఓ కీలక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది.
3. టెస్టు మ్యాచ్ నాలుగురోజులే...
టెస్టు మ్యాచ్‌లపై ప్రజలకు ఆసక్తిని, జట్ల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు వినూత్నంగా ఈ ఏడాది టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). త్వరలో మరో కొత్త నిర్ణయంతో ముందుకొస్తుంది. అదే ఐదు రోజుల సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌ను నాలుగురోజులకు కుదించడం. సభ్యదేశాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అన్నీ ఓకే అయితే 2023 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. 140 ఏళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‌ను ఐదు రోజులే జరుగుతున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు అనూకాలంగా ఉన్నట్లు సమాచారం.
గతంలోనే...
నాలుగురోజుల టెస్టు అనేది పాత అంశమే. 2019లో ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్లు ఈ మ్యాచ్ ఆడాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు 2017లోనే ఈ తరహా మ్యాచ్ ఆడింది.
4. విజేత తేలేవరకు సూపర్ ఓవర్లే...
2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో... న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు టై గా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్ణయించారు. సూపర్ ఓవర్‌లోనూ పరుగులు సమం కావడం వల్ల ఎక్కువ బౌండరీలు బాదిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను ఛాంపియన్‌గా నిర్ణయించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. క్రికెటర్లు, మాజీలు పెదవి విరిచారు. క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఐసీసీని విమర్శించారు. అయితే సూపర్ ఓవర్‌లోనూ స్కోరు సమమైతే విజేత తేలేవరకు అనేక సూపర్ ఓవర్లు ఆడించే పద్ధతిని క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ప్రవేశపెట్టినా... అధికారికంగా ఐసీసీ అమలు చేయాల్సి ఉంది. దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇది ఈ ఏడాది ప్రపంచకప్‌లో అమలయ్యే అవకాశం ఉంది.
5. పాకిస్థాన్,భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్..
భారత్- పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై ఈ ఏడాదైనా ముందడుగు పడుతుందేమో చూడాలి. దాయాదుల క్రికెట్ సమరాలకు రెండు దేశాల ప్రధానుల అనుమతి ఉండాలని దాదా ఇప్పటికే చెప్పాడు. మరి వీటిపై ఏం జరుగుతుందో చూడాలి.
చివరిసారిగా భారత్, పాక్ 2012లో రెండు టీ20లు, 3 వన్డేల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో తలపడ్డాయి. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం వల్ల ఆ దేశంతో సంబంధాలు నానాటికీ దిగజారాయి. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా 2004లో పాక్‌లో చారిత్రక పర్యటనకు వెళ్లింది. 1989 తర్వాత భారత జట్ట అక్కడ పర్యటించడం అదే తొలిసారి. 2019 పుల్వామా ఘటన తర్వాత దాయాదుల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
6.ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్...
ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో ఉన్న కోహ్లీ సేన... ఈ ఏడాది దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. 2019 ఆగస్ట్ 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరగుతున్న యాషెస్ సిరీస్ నుంచే ఈ యాత్ర ప్రారంభమైంది. 2020/21 సీజన్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ జట్లను ఎదుర్కోనుంది టీమిండియా. వాటిని ఓడించి 2021 జూన్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాల్సి ఉంది మెన్ ఇన్ బ్లూ.
7. మిక్స్డ్ టీ20 మ్యాచ్...
పురుషులు, మహిళలు కలిపి మిక్స్డ్ విభాగంలో టీ20 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో ప్రతిపాదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ. అయితే బీసీసీఐ ఇందుకు అనుమతినివ్వడం వల్ల ఈ మ్యాచ్‌కు సంబంధించి ప్రకటనలూ వెలువడ్డాయి. కానీ దీనికి.. సుప్రీం నియమించిన పాలకుల కమిటి కాస్త అడ్డుచెప్పింది. ఫలితంగా కోహ్లీ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ కలిసి ఆడితే చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అయితే ఈ ఏడాదైనా ఈ మ్యాచ్‌లకు అనుమతి లభిస్తుందేమో చూడాలి.
8. విదేశాల్లో 'గులాబి' టెస్టు...
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఇందులో భారత్.. 2 డే/నైట్ టెస్టులు ఆడే ప్రతిపాదనపై ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ) తనను సంప్రదించలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. 4 టెస్టుల సిరీస్‌లో 2 డే/నైట్ టెస్టులు ఆడటం వీలు కానిదని అన్నాడు.
గంగూలీ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ స్పందించాడు. 2020-21 పర్యటనలో భారత్ 2 డే/నైట్ టెస్టులు ఆడేందుకు బీసీసీఐకి ప్రదిపాదన పంపుతామని చెప్పాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్- భారత్ మధ్య జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌కు ఇంతమంది జనం వస్తారని ఊహించలేదన్నాడు గంగూలీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో టెస్టు మ్యాట్ అంటే చాలా ఉత్సాహం వస్తుందని చెప్పాడు.
9. నోబాల్ అంపైర్...
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాతో తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు వేసిన 21 ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నోబాల్స్ బాధ్యతను మూడో అంపైర్‌కు అప్పగించింది ఐసీసీ. ఇప్పటికే పలు సిరీస్‌ల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి... టీ20 ప్రపంచకప్‌లో దీన్ని అమలు చేస్తుందేమో చూడాలి. ఈ సాంకేతికతను ఐపీఎల్లో వాడేందుకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. మరి ఈ ఏడాది ఐపీఎల్లో అమలు చేస్తుందేమో చూడాలి.
10. ఐపీఎల్లో పవర్ ప్లేయర్...
అన్నీ కుదిరితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఓ అనూహ్య మార్పును చూసే అవకాశముంది. పొట్టి క్రికెట్ లీగ్‌ను మరింత రసవత్తరంగా 'పవర్ ప్లేయర్' విధానాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అంటే ఒక వికెట్ పడగానే తుది జట్టులో లేని ఆటగాడిని జట్లు తీసుకోవచ్చు. లేదా మ్యాచ్‌లో ఏ ఓవర్ ముగిసిన తర్వాతైనా సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానం ఆమోదం పొందిందని, ఐపీఎల్ పరిపాలన మండలి సమావేశంలోనూ దీని గురించి చర్చించారు. అయితే సమయం లేకపోవడం వల్ల దీన్ని పక్కనపెట్టారు. ఈ ఏడాదైనా గంగూలీ దీనికి మద్దతు పలుకుతాడేమో చూడాలి.
వీటితో పాటు ధోనీ రీఎంట్రీపైనా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచకప్ సెమీస్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో అతడు వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీసులకు అందుబాటులో లేడు. అయితే ధోనీ గత కొన్ని రోజులుగా తిరిగి మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కఠోర సాధన చేస్తూ శ్రమిస్తున్నాడు. ఫలితంగా 2020 ఐపీఎల్ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చేది లేనిది స్పష్టత రానుంది.