ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతోన్న నేపాల్.. సింగపూర్ వేదికగా జరుగుతోన్న ట్రై సిరీస్‌లో సత్తాచాటుతోంది. ఆతిథ్య జట్టుతో శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆ దేశ కెప్టెన్ శతకంతో చెలరేగి నేపాల్‌ను గెలిపించాడు. లక్ష్య ఛేదనలో శతకం చేసిన తొలి సారిథిగా రికార్డు సృష్టించాడు.

7 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హొరెత్తించాడు పరాస్. 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసి టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన నాలుగో ఆసియా బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. టీ20ల్లో సెంచరీ చేసిన తొలి నేపాల్ క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సింగపూర్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(64) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సురేంద్రన్ చంద్రమోహన్(35) ఫర్వాలేదనిపించాడు. నేపాల్ బౌలర్లలో కరన్ రెండు, సుషాన్ భారి ఓ వికెట్ దక్కించుకున్నారు.
152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ ఆరంభంలోనే ఓపెనర్ ఇషాన్ పాండే(5) వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆరిఫ్ షేక్(39) సాయంతో మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశాడు కెప్టెన్ పరాస్. నాలుగు ఓవర్లు మిగిలుండగానే జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.
ఇదీ చదవండి: లాంగ్ జంప్‌లో.. జమైకన్ వరల్డ్ రికార్డు