ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను భయపెడుతోందని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఐపీఎల్ ఫైనల్స్‌లో కొన్ని సంవత్సరాల నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తోన్న ముంబయి ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కన్నా అత్యుత్తమంగా ఉంది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఎనిమిదిసార్లు ఫైనల్స్‌కు వెళ్లి, మూడుసార్లు విజయం సాధించింది. ముంబయి ఐదుసార్లు ఫైనల్స్ ఆడి, నాలుగుసార్లు కప్పు దక్కించుకుంది' -సంజయ్ మంజ్రేకర్, మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత
గతేడాది జరిగిన ఫైనల్లోనూ ఈ రెండు జట్లే హైదరాబాద్ వేదికగా తలపడ్డాయి. ఒక్క పరుగుతో గెలుపొందిన ముంబయి... నాలుగోసారి విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.
ఐపీఎల్‌లో తాజా ఫలితాలు చూస్తే ముంబయి.. చెన్నై కంటే కాస్త మెరుగ్గా కనిపిస్తోందన్నాడు సంజయ్. ఈ పోటీల్లో గెలుపోటముల శాతం పరిశీలిస్తే.. చెన్నై అత్యుత్తమ జట్టుగా నిలిచిందని. అయితే, కాస్త ఆలస్యంగానైనా ముంబయి ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ సాధించి చెన్నైను వెనక్కు నెట్టిందని చెప్పాడు. ముంబయి ఫైనల్స్‌కు వచ్చిన ప్రతిసారీ గెలుస్తూనే ఉంది, ఆ విషయంలో చెన్నై అంత మెరుగ్గా లేదని మాజీ అభిప్రాయపడ్డాడు. దీంతో చెన్నైను భయపట్టే జట్టుగా ముంబయి మారుతోందని అన్నాడు.
ఐపీఎల్ 13వ సీజన్.. గత నెల 29న మొదలుకావాల్సింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నా, కేసులు ఎక్కువవుతుండటం వల్ల టోర్నీ నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి.