భారత్‌కు మూడు ఐసీసీ ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా ప్రభావంతో తనకు కీలకమైన ఐపీఎల్ వాయిదా పడింది. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో టోర్నీ జరుగుతుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ రీఎంట్రీ కష్టమేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీమిండియా యాజమాన్యమూ ధోనీ ఐపీఎల్లో ఫామ్ నిరూపించుకోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి సమయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.
" టీ20 ప్రపంచకప్‌లో ధోనీని చూడాలనుంది. కానీ అతడి రాక కష్టమే అనిపిస్తోంది. జట్టు అతడిని దాటి ముందుకు వెళ్లిపోయింది. పెద్ద ఆర్బాటాలు లేకుండా ధోనీ సైలెంట్‌గా వీడ్కోలు పలుకుతాడేమో"
-- సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ క్రికెటర్
ఇటీవలే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, పంత్ అద్భుతంగా రాణిస్తున్నారని.. ఇలాంటి సమయంలో కీపింగ్ కోసం మరొకరు అవసరం లేదని అన్నాడు.
ధోనీ వీడ్కోలుపై నిర్ణయం తీసుకోవద్దని, మరికొందరు ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. టీమిండియాకు మహీ పెద్ద ఆస్తి అని అన్నాడు వసీం జాఫర్. ఇటీవలే ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. వికెట్ల వెనుక ధోనీ ఉండటం ప్రస్తుతం జట్టుకు చాలా అవసరమని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
ఈ మధ్య కాలంలో పంత్ విఫలమవడం, జూనియర్లతో టీ20 ప్రపంచకప్‌నకు వెళ్లిన మహిళా టీమిండియా, ఒత్తిడికి లోనై ఫైనల్లో ఓడిపోగానే.. ధోనీ రీఎంట్రీపై బాగా చర్చ జరిగింది. ఐసీసీ ఈవెంట్లలో విజయవంతమైన ఆటగాడిగా పేరున్న మహీ.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే అని కామెంట్లు పెట్టారు.
2019 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓడిన తర్వాత నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేదు ధోనీ. వచ్చే నెల 15 నుంచి మొదలవ్వాల్సిన ఐపీఎల్లో ఇతడు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సీఎస్కే శిక్షణ శిబిరంలోనూ.. ధోనీ సిక్సర్లతో తన ఫామ్ నిరూపించుకున్నాడు.