దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియా మాజీ సారథి ధోనీని ఎంపిక చేయలేదు. సెలక్షన్ కమిటీ అతడిని విస్మరించిందని వార్తలు వచ్చాయి. తాజాగా అవన్నీ అవాస్తవాలేనని సెలక్షన్ కమిటీలోని సభ్యుడొకరు మీడియాకు తెలిపారు. 2020 టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు మహీయే తమకు సమయం ఇచ్చాడని వివరణ ఇచ్చారు.
‘"ధోనీని పక్కకు పెట్టారన్న ప్రశ్నే లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, పటిష్ఠమైన జట్టును రూపొందించేందుకు నిజానికి అతడే మాకు సమయం ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ గాయపడితే అతడి స్థానం భర్తీచేసే మరొక ఆటగాడు లేడని ధోనీ భావిస్తున్నాడు. అందుకే అతడు ఆగిపోయాడు"
-టీమిండియా సెలెక్టర్
2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ పాత్ర గురించి చర్చించారా అన్న ప్రశ్నకు ‘"లేదు. భవిష్యత్తు ప్రణాళిక గురించి మేము అతడితో చర్చించాల్సి ఉంది. అందుకే మేం ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, రిజర్వు ఆటగాళ్లను పటిష్ఠం చేసుకొనేందుకు అతడే మాకు సమయం ఇచ్చాడు. ఏదో సందర్భంలో పంత్ గాయపడితే, టీ20 ప్రపంచకప్ మిస్సయితే అప్పుడు ధోనీ లేకుంటే పరిస్థితి ఏంటన్నది చూడాల్సి ఉంది. కీపర్‌గానే కాదు అతడిలాంటి ఫినిషరూ మాకింకా దొరకలేదు. విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచకప్ సెమీస్‌లో అతడి అనుభవం ఎంతో ఉపయోగపడింది. 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఒక ఆటగాడిని విమర్శించడం తేలికే. వారు చూసిన మ్యాచులకన్నా మహీ గెలిపించిన మ్యాచులే ఎక్కువుంటాయి"
-టీమిండియా సెలెక్టర్
ఆర్మీలో సేవలు అందించాలని భావించిన ధోనీ విండీస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ధోనీ స్థానంలో పంత్‌ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఈ విషయంపై విమర్శలూ వచ్చాయి.
ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'