టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో తాజాగా లైవ్‌చాట్‌లో పాల్గొన్న బౌలర్ షమి.. తన జీవితంలోని ఆశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. ఒకానొక సమయంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు. వ్యక్తిగత, ప్రొఫెషనల్ సమస్యల ఒత్తిడి వల్లే ఇలా భావించినట్లు తెలిపాడు. కుటుంబం అండగా నిలవడం వల్ల వీటిని అధిగమించానని అన్నాడు.
![Mohammed Shami](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mohammed-shami3_0701newsroom_1578365387_536.jpg)
"2015 ప్రపంచకప్‌లో ఆడుతూ గాయపడ్డా. ఆ తర్వాత కోలుకోవడానికి దాదాపు 18 నెలలు పట్టింది. అది నా జీవితంలో బాధాకర సంఘటన. అనంతరం మళ్లీ నేను ఆట మొదలుపెట్టినప్పుడు వ్యక్తిగత సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నాకు కుటుంబం అండగా నిలవకపోయుంటే మూడుసార్లు ఆత్మహత్య చేసుకునేవాడిని. వారు నాపై ఎప్పుడూ కన్నేసి ఉంచేవారు. ఫ్యామిలీ లేకుంటే నా కెరీర్ ఎప్పుడో అంతమై ఉండేది" -మహ్మద్ షమి, భారత క్రికెటర్
2018లో ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం చేసిన షమి.. అప్పటి నుంచి సత్తా చాటుతూ వస్తున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం మరో విశేషం. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేశారు.