టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. సుధీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అంత సులభం కాదని అన్నాడు భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్. తిరిగి అతడు జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
"తిరిగి జట్టులోకి రావాలా వద్దా అనేది పూర్తిగా ధోనీ సొంత నిర్ణయం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. కరోనా వల్ల ఈ లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు" -అజహరుద్దీన్, భారత మాజీ క్రికెటర్
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తాత్కాలిక విరామమిచ్చిన ధోనీ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాల్గొని టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. కానీ అతడి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఈ విషయమై మాట్లాడిన అజహరుద్దీన్.. ధోనీ రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరగాలి. సుధీర్ఘ విరామం తర్వాత జట్టులోకి రావడం అంటే కష్టమే. ఎంత స్టార్ క్రికెటర్‌కు అయినా ప్రాక్టీసు చాలా ముఖ్యం. ప్రాక్టీసు చేయడం వేరు, మ్యాచ్ ఆడటం వేరు" -అజహరుద్దీన్, భారత మాజీ క్రికెటర్
కరోనా వల్ల గతనెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ను తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. వైరస్ ప్రభావం ఎంతకీ తగ్గకపోవడం వల్ల ఈ లీగ్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దీంతో ధోనీ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.