ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెరీర్లో ఎన్నో ఘనతల్ని సాధించి జట్టును విజయపథాన నడిపించిన మహీ రిటైర్మెంట్ పట్ల వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖెల్ హోల్డింగ్ తాజాగా స్పందించాడు. ధోనీ తన పని తాను ప్రశాంతంగా చేసుకుపోయేవాడంటూ వెల్లడించాడు.
"ధోనీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించినపుడు అతడు ఎపుడూ ప్రశాంతతను కోల్పోలేదు. ఆటలో పట్టు కోల్పోతున్నాం అనే సందర్భంలో ఆటగాళ్లను పిలిచి వారితో మాట్లాడేవాడు. మళ్లీ తన పని తాను చేసుకునేవాడు. తన నిర్ణయాలతో మ్యాచ్ గమనాన్నే మార్చేసేవాడు. అతడి కెరీర్ గొప్పగా సాగింది. 90 టెస్టులు, 350 వన్డేలు, మరెన్నో టీ20 (98)లు ఆడాడు. టెస్టుల్లో చూసుకుంటే ఐదు వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే.. ధోనీ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్ కాదు. అతడో వికెట్ కీపర్. అయినా అతడు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. అలాగే వన్డేల్లోను మంచి ప్రదర్శన చేశాడు. 12వేల బంతులాడి 11 వేలకు దగ్గరగా పరుగులు సాధించాడు. అంటే బంతికొక పరుగు చేశాడు. ధోనీ పవర్ ఫుల్ బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది."
-మైఖెల్ హోల్డింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్
ధోనీ కెరీర్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఓ ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి విదేశాల్లోనూ సత్తాచాటగల మెరుగైన జట్టుగా తీర్చిదిద్దాడు.