ముంబయి వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ప్రయోగాత్మకంగా ఈ స్థానంలో బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ మంజ్రేకర్, హర్భజన్ సింగ్ ఈ నిర్ణయంపై పెదవి విరిచారు. తాజాగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హెడేన్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
"విరాట్ కోహ్లీ దాదాపు 230 మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 180 సార్లు మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 10వేల పైచిలుకు పరుగులు రాబట్టాడు. బాగా ఆడుతున్న ఆ స్థానం నుంచి కోహ్లీ ఎందుకు తప్పుకోవాలి? ఈ చర్యపై కనీసం చర్చైనా ఎందుకు జరగడం లేదు? అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందే."
- మాథ్యూ హెడేన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు భారత్ ఆడే చాలా మ్యాచ్‌లకు హెడేన్ వ్యాఖ్యాతగా ఉంటున్నాడు.
విరాట్ ప్రదర్శన ఇదీ...
తాజాగా జరిగిన ముంబయి మ్యాచ్‌ను మినహాయిస్తే విరాట్ నాలుగో స్థానంలో 38 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 56.48 సగటు, 90.49 స్ట్రైక్‌రేట్‌తో 1,751 పరుగులు చేశాడు. అంటే మొత్తం పరుగుల్లో దాదాపు 16 శాతం. ఇందులో 7 శతకాలు, 8 అర్ధశతకాలు ఉన్నాయి. 2015, జనవరి నుంచి మాత్రం విరాట్.. నాలుగో స్థానంలో అంతగా ఆకట్టుకోలేదు. అప్పటినుంచి 7 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ... 62 పరుగులు మాత్రమే సాధించాడు. సగటు 10.66గా నమోదైంది.
శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్ నుంచి కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. అతడికిచ్చిన ప్రతి పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో లంక సిరీస్‌లో అదరగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం ధావన్, రాహుల్‌ని ఎంపిక చేశారు. వీరిలో ఎవరిని తుది జట్టులో ఉంచాలన్న దానిపై డ్రెస్సింగ్ రూమ్‌లో తలనొప్పి మొదలైంది. అందుకే కోహ్లీ తన స్థానాన్ని మార్చుకుని రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు. దానిని అతడు బాగానే వినియోగించుకున్నాడు. కోహ్లీ మాత్రం 14 బంతుల్లో 16 పరుగులు చేసి విఫలమయ్యాడు. అయితే మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లీ.. ప్రయోగం చేసి విఫలమయ్యామని చెప్పుకొచ్చాడు. మూడో స్థానంపై నిర్ణయం మార్చుకునేందుకు ప్రయత్నిస్తామని పరోక్షంగా వెల్లడించాడు.