భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే ఒకప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపించేది. ఆసీస్ కవ్వింపులకు టీమిండియా దీటుగా బదులిస్తుంటే అభిమానులు మ్యాచ్‌లను ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ప్రశాంత వాతావారణం నెలకొంది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మాటల యుద్ధం జరగట్లేదు. రెండో టెస్టులో మాథ్యూ వేడ్ మినహా ఎవరూ నోటికి పనిచెప్పలేదు. అయితే ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మన్ లబుషేన్ భారత ఓపెనర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని వినూత్నంగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆసీస్ 338 పరుగులకు ఆలౌటైన అనంతరం రోహిత్, గిల్ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఆసీస్ బౌలర్లను వారిద్దరూ దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకుంటున్నారు. అయితే వాళ్ల ఏక్రాగ్రతను దెబ్బతీయాలని భావించిన లబుషేన్ సరదా ప్రశ్నలతో విసిగించాడు. గిల్‌ను..'నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు?' అని ప్రశ్నించాడు. దానికి గిల్ 'తర్వాత చెప్తా' అని సమాధానమిచ్చాడు. 'తర్వాత అంటే? ఈ బాల్ ఆడిన తర్వాతనా?.. సచిన్ ఇష్టమా? లేదా కోహ్లీనా' అని అడిగాడు. దీనికి గిల్ ఎలాంటి సమాధానమివ్వలేదు.
మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ను కూడా లబుషేన్ మాట్లాడించడానికి ప్రయత్నించాడు. 'క్వారంటైన్‌లో ఏం చేశావ్' అని అడిగాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత హిట్‌మ్యాన్ 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓ అభిమాని అత్యుత్సాహం వల్ల నలుగురు భారత ఆటగాళ్లతో సహా అయిదు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే, లబుషేన్ ఎంత ప్రయత్నించినా గిల్, రోహిత్ బ్యాటుతో తమ పని చేసుకుపోయారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. గిల్ (50) అర్ధశతకం సాధించగా, రోహిత్ 26 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 96/2తో నిలిచింది. ఆసీస్ కంటే ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియా పాలిట ఆపద్బాంధవుడు జడ్డూ!