ఇండియా-ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల సారథి మోర్గాన్.. తమ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ బ్యాట్స్‌మన్ మలన్ సాధించేది తలచుకుంటే భయమేస్తుందని తెలిపాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మలన్ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
'మలన్ ఎంత దూరం వెళ్తాడో నాకు తెలియదు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడు ఇలాగే కొనసాగితే ఏం చేస్తాడోనని భయమేస్తుంది. ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్ అతడిని కొనుగోలు చేసింది. దీంతో భారత్‌లో ఆడుతూ ఇక్కడ తన అనుభవాన్ని కొనసాగిస్తాడు. రాబోయే రోజుల్లో టీ20 ప్రపంచకప్ ఉండడం మాకు కలిసొస్తుంది' అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌పై స్పందిస్తూ.. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఆడటం వల్ల తాము ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుందని చెప్పాడు. ప్రపంచంలోనే మేటి జట్టు అయిన టీమ్‌ఇండియాతో తలపడుతున్నామని, దాన్ని ఓడించడం అంతతేలిక కాదనే విషయం తమకు తెలుసన్నాడు. దీంతో రాబోయే సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోర్గాన్ చెప్పాడు.
ఇదీ చదవండి: 'ఈడెన్ కంటే మెల్బోర్న్, గబ్బా విజయాలే ప్రత్యేకం'