అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు సత్తాచాటారు. వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
లోకేష్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తమ తమ స్థానాలు మెరుగుపర్చుకున్నారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 185 పరుగులతో సత్తాచాటిన రాహుల్ 17 స్థానాలు ఎగబాకి 71వ ర్యాంకుకు చేరాడు. 135 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ 104 నుంచి 81వ స్థానానికి ఎగబాకాడు. విండీస్ ఆటగాడు హోప్ టాప్-10లో దూసుకొచ్చాడు. 5 స్థానాలు ముందుకొచ్చి 9వ ర్యాంకుకు చేరాడు.
విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 85 పరుగులతో ఆకట్టుకున్న విరాట్.. వరుసగా నాలుగో ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు) అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. 2016లో 2,595... 2017లో 2,818... 2018లో 2,735... 2019లో 2,455 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 2,442 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
మూడో వన్డేలో ప్రదర్శనతో రోహిత్.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు (1,490) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం ఈ సంవత్సరం 28 వన్డేలు ఆడాడు. ఇందులో 7 శతకాలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి తర్వాత కోహ్లీ 1,377 పరుగులతో రెండో స్థానంలో, విండీస్ క్రికెటర్ షై హోప్(1,345) మూడో స్థానంలో నిలిచారు.
ఇదీ చదవండి: ఈ ఏడాది కోహ్లీ-రోహిత్ రికార్డుల వేట