టెస్టు క్రికెట్లో భారత ఆధిపత్యం కొనసాగుతోంది. బ్యాటింగ్ విభాగంలో ముగ్గురు, బౌలింగ్ మరో ముగ్గురు భారత ఆటగాళ్లు... టాప్-10లో చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికీ రారాజుగా కొనసాగుతున్నాడు. ఇవాళ ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 928 పాయింట్లతో విరాట్ అగ్రస్థానం కాపాడుకున్నాడు. 911 పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
నయావాల్ పుజారా 791 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా... రహనే 759 పాయింట్లతో 8 నుంచి 9వ స్థానానికి దిగజారాడు. ఫలితంగా టాప్-10 బ్యాట్స్‌మన్ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
టాప్-10లో 'హ్యాట్రిక్' బౌలర్లు...
టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 794 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. మరో టీమిండియా బౌలర్ రవిచంద్ర అశ్విన్ 8లో ఉండగా.. తాజాగా షమి 9వ స్థానంలో నిలిచాడు. ఫలితంగా టాప్-10లో ముగ్గురు టీమిండియా బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కమిన్స్.. 904 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా 406 పాయింట్లతో 3వ స్థానంలోనే మార్పు లేకుండా ఉండగా.. అశ్విన్ ఒక్క ర్యాంక్ మెరుగుపడి 308 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరాడు.
ఫిలాండర్‌కు బెస్ట్...
దక్షిణాఫ్రికా ఆటగాడు ఫిలాండర్ ఆల్‌రౌండర్ విభాగంలో 5వ స్థానంలో, బౌలర్ల విభాగంలో 11వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అత్యుత్తమ ర్యాంకింగ్స్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
మనమే టాప్...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండూ, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా(296), ఇంగ్లాండ్(146) వరుసగా ఉన్నాయి. పాకిస్థాన్, శ్రీలంక చెరో 80 పాయింట్లతో నాలుగు, ఐదు ర్యాంక్‌ల్లో ఉండగా... న్యూజిలాండ్(60), దక్షిణాఫ్రికా (24), బంగ్లాదేశ్(0), వెస్టిండీస్(0) వరుసగా జాబితాలో నిలిచాయి.